రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే సార్వత్రిక ఎన్నికలు ఇవి. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈనెల 16 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. అయినా అధికార వైకాపా ఎక్కడికక్కడ కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. గ్రామ/వార్డు వాలంటీర్లు, ఉపాధి, వైకేపీ, రెవెన్యూ.. తదితర శాఖల సిబ్బంది ఎన్నికల ప్రచారంలో తిప్పుకుంటోంది. జిల్లా యంత్రాంగం మాత్రం పట్టీపట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సి విజిల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేసేలా అవకాశం కల్పిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు. ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయవచ్చు. ఫొటో, వీడియో, ఆడియో.. ఏదొక రకంగా సమాచారం అందిస్తే వంద నిమిషాల్లో పరిష్కరిస్తారు. ఫిర్యాదు అందిన ఐదు నిమిషాల్లో క్షేత్ర సిబ్బందికి సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి 15 నిమిషాల్లో నిర్దేశిత ప్రాంతానికి సిబ్బంది చేరుకుని, 30 నిమిషాల్లో విచారణ నివేదికను సంబంధిత ఆర్‌ఓకు పంపిస్తారు. 50 నిమిషాల్లో సమస్య పరిష్కారం లేదా తగిన చర్య తీసుకోనున్నారు. మొత్తంగా వంద నిమిషాల్లో ప్రక్రియ పూర్తి కానుంది.
దేనిపై చేయవచ్చంటే..!
ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఏ అంశంపైనైనా ఫిర్యాదు చేయవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో పార్టీల రంగులు, జెండాలు, కటౌట్లు, హోర్డింగు, బ్యానర్లు, కరపత్రాలు, పేర్లు వంటివి.. ఓటర్లను ప్రలోభ పెట్టేలా డబ్బు పంపిణీ, ఉచిత బహుమతులు.., రెచ్చగొట్టే ప్రసంగాలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ.. పోలింగ్ రోజున ఓటర్ల తరలింపు.. తదితరాలపై ఫొటో, వీడియో, ఆడియో రూపంలో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది.
కోడ్ అమల్లోకి వచ్చి నాటి నుంచి ఇప్పటి దాకా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 201 ఫిర్యాదులు అందాయి. గురువారం ఒక్క రోజే అనంత జిల్లాలో 21, శ్రీసత్యసాయి జిల్లాలో 11 మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి. తాడిపత్రి, కళ్యాణదుర్గం, అనంత నగరం, రాయదుర్గం తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఫిర్యాదు చేశారు. మరోవైపు ఎన్ని పరిష్కారం చేశారన్న వివరాలు జిల్లా యంత్రాంగం గోప్యంగా ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి.
source : eenadu.net
Discussion about this post