ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు బేఖాతరు చేస్తూనే ఉన్నారు. కొందరు ఏకంగా వైకాపా కండువాలు వేసుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హద్దులు దాటుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సుమారు 80 మందికిపైగా వాలంటీర్లు, ఉద్యోగులపై అధికారులు వేటు వేశారు. సీఎం ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో ఏకంగా 17మందిపై కొరడా ఝళిపించారు. ఒక్క గుంటూరు జిల్లా పొన్నూరు పరిధిలోనే 45 మంది వాలంటీర్లను తొలగించారు. అయినప్పటికీ పలుచోట్ల వాలంటీర్ల ప్రచార దూకుడు తగ్గడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మద్దతుగా ఓడీసీ మండలంలో జరిగిన ప్రచారంలో వాలంటీర్లు మంజుల, అనిల్‌కుమార్ పాల్గొని వైకాపా కండువాలు వేసుకుని నృత్యం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైకాపా అభ్యర్థి రంగయ్యతో వార్డు వాలంటీరు రిజ్వానా, చౌక డిపో డీలర్లు ఇద్దరు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామానికి తపాలాశాఖ ద్వారా పంపిన ఓటరు గుర్తింపు కార్డులను వైకాపా నాయకులు సేకరించి వాలంటీర్లకు ఇచ్చి రాత్రిళ్లు ఇంటింటికి అందజేస్తున్నారు. ఇదే సమయంలో వారు ప్రచారం చేస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోపాలపురంలో నిర్వహించిన పల్లెపల్లెకు హనిమిరెడ్డి కార్యక్రమంలో వాలంటీరు కారుమంచి నారాయణ పాల్గొన్నారు. బల్లికురవ మండలం కొప్పెరపాడులో వైకాపా ప్రచారంలో వాలంటీరు బుర్రి దానారావు ఉన్నారు. వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నరసరావుపేట వైకాపా ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ 19న నిర్వహించిన ప్రచార ర్యాలీలో ముగ్గురు వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంత్రి సురేష్, ఒంగోలు పార్లమెంటు వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల ప్రచారంలో వాలంటీర్లు పొన్నూరి సురేష్, దేపూరి శివయ్య, చిరిమళ్ల మణికంఠలతోపాటు ఉపాధిహామీ క్షేత్ర సహాయకుడు కొండలరావు ఉన్నారు.
source : eenadu.net
Discussion about this post