ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. గురువారం ప్రజావేదిక నుంచి ప్రారంభమైన ర్యాలీ వాల్మీకి, మహాత్మాగాంధీ, అంబేడ్కర్ కూడలి మీదుగా టీ కూడలి వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు ఎలాంటి అభివృద్ధి చేయని గత పాలకులు ఇప్పుడు ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న సమయంలో రంగయ్య నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే జీడిపల్లి నుంచి కృష్ణాజలాలు తీసుకొచ్చి 114 చెరువులను నీటితో నింపుతానని పేర్కొన్నారు. రహదారులు వేసి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణను గెలిపించాలని కోరారు.
నామినేషన్ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కళ్యాణదుర్గం పసుపుమయంగా మారింది. అభ్యర్థిని గజమాలతో సత్కరించారు. భారీ జనసందోహం మధ్య ర్యాలీ కొనసాగింది. నాయకులు, కార్యకర్తలు నృత్యాలతో సందడి చేశారు.
source : eenadu.net
Discussion about this post