‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా’ అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. తెదేపా హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1000కి ఇస్తే వైకాపా రూ.5వేలు చేసిందని, మిగిలిన రూ.4వేలు ఎవరి జేబులోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. వైకాపా దుర్మార్గపు ఇసుక విధానం వల్ల వేలమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాలకు తగ్గకుండా ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, పాలకొల్లు పట్టణాల్లో శుక్రవారం ప్రజాగళం రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు. రెండు సభల్లో చంద్రబాబు ప్రసంగించారు.
‘వైకాపా ఫ్యాన్ అరిగిపోయింది. ఇక తిరిగే పరిస్థితిలో లేదు. ప్రజలు ముక్కలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయిదేళ్ల జగన్ పాలనలో యువత జీవితాలు బుగ్గి పాలయ్యాయి. అన్ని వర్గాలూ అణగారిపోయాయి’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. తెదేపా, ఎన్డీయే ప్రభుత్వం 2014-19లో వైకాపా కంటే మెరుగ్గా 19% సంపదను సంక్షేమ పథకాలకు ఖర్చుచేసిందని గుర్తుచేశారు.
source : eenadu.net
Discussion about this post