ఇదే పాలన కొనసాగితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా?
అందుకే అభివృద్ధి.. సంక్షేమం ఎజెండాతో వస్తున్న తెదేపా-జనసేన-భాజపాకు మద్దతిస్తున్నాం
ఎవరూ సొంత డబ్బు పంచడం లేదు కదా
ప్రజలు ఎవరికీ రుణ పడి ఉండనక్కర్లేదు
లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ
సంక్షేమం అవసరమే. కానీ సంక్షేమం ఒక్కటే పరిపాలన అనుకుంటే ఈ దేశానికి అధోగతే. పథకాలు ఇచ్చాం కదా… ఇంకేం కావాలి అని ప్రజల్ని పాలకులు అడుగుతున్నారు. సంక్షేమం ఒక్కటే పరిపాలన అంటున్న వైకాపా కన్నా సంక్షేమంతో పాటు అభివృద్ధినీ కోరుకుంటున్న తెదేపా-జనసేన-భాజపా కూటమి గెలుపు ముఖ్యం.
ఈ ఐదేళ్లుగా ఏపీ ఎంతో కోల్పోయింది. దేశంలో ఆర్థికవృద్ధికి బాటలు పడుతున్నా వాటిని అందిపుచ్చుకోకుండా రాష్ట్రం నిద్రాణమైపోయింది. ఆర్థికవృద్ధి లేనేలేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టలేమంటూ పారిశ్రామికవేత్తలు చేతులెత్తేశారు. మౌలిక సౌకర్యాలు లేవు. రోడ్లు దెబ్బతిన్నాయి.
‘రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. నిర్ణయాత్మకమైనవి. జగన్‌కు, చంద్రబాబుకు మధ్యనో, వైకాపాకు – తెదేపా, భాజపా, జనసేన కూటమికి మధ్యనో జరుగుతున్న ఎన్నికలు మాత్రమే అనే చర్చ సరికాదు. ఇవి రెండు కీలకాంశాల మధ్య జరిగే ఎన్నికలు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేవి. సంక్షేమం మాత్రమే పరిపాలన అనుకునే వైకాపాకు… సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, మౌలిక సౌకర్యాలు, పెట్టుబడుల కల్పన, పారిశ్రామికీకరణ, చట్టబద్ధపాలన ముఖ్యమనుకున్న తెదేపా-జనసేన-భాజపా కూటమికి మధ్య పోరాటమిది. రాబోయే 25 ఏళ్లలో దేశంలో జరగనున్న అభివృద్ధిని అందిపుచ్చుకునే విధానాలతో ముందుకు వచ్చిన ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటిస్తున్నాం’ అని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. విజయవాడ రోటరీహాలులో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజలు తమ బాధ్యతను గుర్తెరిగి ఓట్లు వేయాలని, తప్పనిసరిగా అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.చంద్రశేఖర్, డాక్టర్ పట్టాభిరామయ్య, వజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై జయప్రకాశ్ నారాయణ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే…
ఈ పాలన మళ్లీ కావాలా?
ప్రజలు ప్రశాంతంగా ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పాలన యథాతథంగా కొనసాగాలా? ఎల్లకాలం ప్రజలవి పుచ్చుకునే చేతులే అయితే, ఎప్పుడూ బీదరికాన్ని మోస్తూనే ఉంటే అది జాతికి ప్రమాదకరం. సంక్షేమం సమర్థంగా అమలైనా.. ఇంటికి ఉచితంగా బియ్యం వచ్చినా, డబ్బులు ఉచితంగా ఇచ్చినా 10 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో మీ పిల్లలు వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడగలరు అని మీరు నమ్మగలరా? వాళ్ల భవిష్యత్తు బాగుంటుందని భావించగలరా? సంక్షేమం అంటే వ్యక్తిగతంగా అందే తాత్కాలిక ప్రయోజనాలే. సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతూకం అవసరం. ఈ కీలక సమయంలో మన పిల్లల భవిష్యత్తును కాపాడుకునేలా ప్రజలు తీర్పు ఇవ్వాలి. ఏ నాయకుడూ తన సొంత డబ్బు ఇవ్వడం లేదు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన డబ్బు ఇది. మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి ప్రభుత్వం అప్పు తెచ్చిన డబ్బు ఇది. సంక్షేమ పథకాల కింద డబ్బు ఇచ్చి ప్రజలు తమకు రుణపడి ఉండాలని కొందరు నాయకులు కోరుకుంటున్నారు. ఇది సరికాదు. పాలకులకు ప్రజలు రుణపడి ఉండనక్కర్లేదు. రుణపడి ఉండాలనుకునేది బానిస భావన. దాన్ని దాటుకుని వెళ్లి ఓట్లెయ్యాలి.
ఎన్నడూ ఇంతటి దారుణ పరిస్థితుల్లేవు
రాష్ట్రంలో ప్రశాంతంగా ఓటు వేసే అవకాశం ఉంటుందా? అని భయం కలుగుతోంది. ఇలాంటి భయానక పరిస్థితులు గతంలో లేవు. ఎన్నికల కమిషన్, అధికార యంత్రాంగం ఎన్నికల సమయంలో బాగా పని చేస్తాయని నమ్మకం ఉంది. ధైర్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు వేయండి. ఈవీఎంలను అనుమానించొవద్దు. కొన్ని లోపాలున్నా మన దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
కులం కాదు… పిల్లల భవిష్యత్తు ముఖ్యం
ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఒక కులం బాగు పడుతుందనుకోవడం పొరపాటు. సవాల్ చేసి చెబుతున్నా… ఏ కులమూ బాగుపడదు. ఆ కులంలోని కొందరు బడా గుత్తేదారులో, అధికారులో, నేతలో బాగుపడొచ్చు. సామాన్య ప్రజలు ఆలోచించాల్సింది కులాల గురించి కాదు. ఏ రకమైన సామర్థ్యమూ లేని కొందరు నేతలు సమాజాన్ని కులాలుగా, వర్గాలుగా ముక్కలు చేశారు. వాటినే సమీకరణలుగా వాడుకుంటున్నారు.
అన్నింటి కన్నా ఆర్థిక భవిష్యత్తు ఎంతో ముఖ్యం. ఐదేళ్లుగా ఏపీ చాలా కోల్పోయింది. విస్తారమైన తీరప్రాంతం, వృత్తి నైపుణ్యం ఉన్న రాష్ట్రమిది. అయినప్పటికీ నిద్రాణమైపోయింది. 2019కి ముందు పోలవరం నిర్మాణం వేగంగా జరిగింది. ఇప్పుడు ఆగిపోయింది. రాష్ట్రానికి అమరావతి వంటి పెద్ద గ్రీన్‌ఫీల్డ్ సిటీ కావాలి. చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించుకున్నాం. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటైంది. ఇప్పుడు చూస్తే హైదరాబాద్‌లో ఉన్నామా, వేరే దేశంలో ఉన్నామా అనేలా అభివృద్ధి సాధించింది. ఒక పెద్ద రాజధాని నగరం ఏపీకీ కావాల్సిందే. అమరావతిని అద్భుతంగా నిర్మించుకోవాలి. లేకపోతే అంతర్జాతీయ నైపుణ్యం ఉన్న వారు ఇక్కడికి రారు. దీంతో పాటు వంద చిన్న పట్టణాలను సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో చట్టబద్ధ పాలన ఉండాలి. ఇందుకు కొన్ని కనీస ప్రమాణాల్ని నెలకొల్పుకోవాలి.
source : eenadu.net
Discussion about this post