టీడీపీలో కామాంధులు ఎక్కువయ్యారని, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే కీచక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీ ప్రభాకరరెడ్డి అని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఘాటుగా విమర్శించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందడం జేసీ ప్రభాకరరెడ్డి నైజమన్నారు. తాడిపత్రి మండలం వెలమకూరులో బాబాయిని చంపించడమే కాక హతుడి భార్యపై కేసు పెట్టించిన దుర్మార్గాన్ని ప్రజలెవ్వరూ మరిచిపోలేదన్నారు. అలాగే పెద్దవడుగూరు మండలం అప్పెచెర్లలో భాస్కర్‌రెడ్డిని చంపించి మహిళ అని చూడకుండా కేసులు పెట్టించిన నీచ సంస్కృతి జేసీ ప్రభాకరరెడ్డిదన్నారు. జేసీ అనుచరుడు, తాడిపత్రిలోని నందలపాడుకు చెందిన టీడీపీ కౌన్సిలర్ విజయ్‌కుమార్ మహిళలను వేధించిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. గతంలో ఓ మహిళను వేధించిన ఘటన సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిందన్నారు. ప్రేమ పేరుతో గర్భవతిని చేసి పెళ్లి చేసుకోకుండా తనను వంచించిన కౌన్సిలర్ మల్లికార్జునపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని జేసీ వద్దకు వెళ్లిన యువతిని వెటకారంగా మాట్లాడి అవమానించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జేసీ ప్రభాకరరెడ్డి తనకు అన్యాయం చేయడంతోనే న్యాయం కోసం సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఆ సమయంలో కీచక కౌన్సిలర్‌కు మద్దతుగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టి యావత్ మహిళాలోకాన్ని అవమానించిన నీచ చరిత్ర జేసీదన్నారు. మహిళలపై సాగించిన అరాచకాల జాబితా తన వద్ద ఉందని, కావాలంటే వాటిని జేసీకి పంపుతానన్నారు.
వాహనాల కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినందుకే జేసీపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. ఈ కేసులను విజయవాడ కోర్టులో ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో తాడిపత్రి కోర్టుకు మార్పించుకున్నాడన్నారు. మునిసిపాలిటీలో డీజల్ దొంగ ఎవరో ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యమన్నారు. యూజీడీలో రాళ్లు, ఇతర సామగ్రి వేసి మురికి నీరు వెళ్లకుండా చేసి వాటిని క్లీన్ చేయకుండా అడ్డుకుంటున్నాడని తనపై విష ప్రచారానికి జేసీ తెరలేపాడని గుర్తు చేశారు. తన సొంత డబ్బు వెచ్చించి దాదాపు రెండు నెలల పాటు కార్మికులతో మరమ్మతులు చేయించానన్నారు. ఈ ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిపై, గతంలో జేసీ చేసిన అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నాయకులు, మద్దతుదారులను వదిలి హైదరాబాద్, ఊటి వెళ్లిపోతానని జేసీ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జేసీ అరాచకాలను ఎదుర్కొనేందుకు తాను తాడిపత్రిలోనే ఉంటానన్నారు. అందుకే తాడిపత్రిలో సొంత ఇల్లు కూడా కట్టించుకున్నట్లు తెలిపారు.
source : sakshi.com
Discussion about this post