ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నియోజకవర్గంలో వైకాపా తప్ప మరో పార్టీ ఉండకూడదనేలా తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం పుంగనూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తెదేపా కార్యకర్త హేమాద్రి ఉదయం 11 గంటల సమయంలో పట్టణంలోని సంతగేటుకు వెళుతుండగా.. వైకాపా కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. రాష్ట్ర జానపద కళల సంస్థ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంట్లోకి తీసుకెళ్లి చొక్కా చించి చితకబాదారు. ఇకపై తెదేపా తరఫున ప్రచారం చేసినా, తెదేపా నాయకులతో కలిసి తిరిగినా చంపేస్తామంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా రెండు తెల్లని పొడి ప్యాకెట్లు చేతులో పెట్టి, ముఖంపై కూడా చల్లారు. ఈ డ్రగ్స్ తెదేపా నాయకులు సీవీరెడ్డి, గిరి, ఎ.నాగరాజ, ఎస్.సుహేల్ బాషా, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు ఇచ్చారని బలవంతంగా చెప్పించి వీడియో తీశారు. ఇంతలో కిడ్నాప్ విషయం తెదేపా శ్రేణులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హేమాద్రిని బయటకు పంపాలంటూ వైకాపా నాయకుడు కొండవీటి నాగభూషణం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హేమాద్రి వైకాపా కార్యకర్తల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు. ‘వైకాపా వాళ్లు తెల్లని పొడి ప్యాకెట్లు చేతిలో పెట్టి..ఈ డ్రగ్స్ తెదేపా నాయకులు ఇచ్చినట్లు చెప్పాలంటూ బలవంతంగా వీడియో తీశారు. ఆ ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు. నా సెల్‌ఫోన్, బంగారు గొలుసు లాక్కున్నారు’ అని హేమాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకా చలపతి, కొండవీటి నాగభూషణం, అమ్ము, సాయి, ఇర్ఫాన్, ప్రభు, అమ్ముకుట్టి, మంజు నిందితులని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలుగుదేశం నాయకులు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుండగానే వైకాపా శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని స్టేషన్‌ను ముట్టడించినట్లు వ్యవహరించారు. బాధితుడైన తెదేపా కార్యకర్త హేమాద్రిపై సీఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. పుంగనూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ లలిత, కౌన్సిలర్లు లలిత, రేష్మలను ప్రభు అనే వ్యక్తి ఆలయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో హేమాద్రి అసభ్యంగా దూషించి దాడి చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో హేమాద్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైకాపా నాయకులపై ఏ కేసు పెట్టారో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
వైకాపా శ్రేణులు తెదేపా కార్యకర్త హేమాద్రిని అపహరించి..చేతిలో డ్రగ్స్(తెల్లని పొడి) ప్యాకెట్లు చేతిలో పెట్టినట్లు వార్తలు వ్యాప్తికావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ మాదకద్రవ్యం వైకాపా నాయకుల చేతికి ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఎవరి నుంచైనా వాటిని కొనుగోలు చేసి పుంగనూరులో వైకాపా కార్యకర్తలు విక్రయిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘డ్రగ్స్’ మరకలను ప్రణాళిక ప్రకారం తెదేపా నాయకులకు అంటగట్టి, అరెస్టులు చేసి ఎన్నికల వరకు పుంగనూరులో బయటకు రాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు తప్పు చేసినా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపే పరిస్థితి లేదు. పోలీసు యంత్రాంగం మొత్తం వైకాపాకే వత్తాసు పలుకుతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా ఇదేవిధంగా వ్యవహరిస్తూ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. డ్రగ్స్ ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
source : eenadu.net
Discussion about this post