పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేసిన భూ కబ్జాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని, దీనికి జిల్లా అధికారుల అనుమతి తీసుకుంటే ఎక్కడికైనా వచ్చేందుకు తాము సిద్ధమని.. బాధితులను సైతం తీసుకొస్తామని గౌరు దంపతులు అన్నారు. వారు శనివారం విలేకరులతో మాట్లాడారు. తెదేపా నేత గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ కల్లూరు మండలం దూపాడు గ్రామంలోని సర్వే నంబరు 139లో ఎమ్మెల్యే కాటసాని 450 మందికిపైగా పట్టాలు ఇప్పించారని.. ప్రస్తుతం ఆ భూమి మాయమైందన్నారు. సర్వే నంబరు సైతం సబ్ డివిజన్లు చేశారని ఆరోపించారు. ఇలా చెప్పుకొంటూ పోతే చిట్టా చాలా ఉందని తెలిపారు. తమ వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఒక్క ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. కల్లూరు కాలనీల్లో జనాలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించలేదన్నారు. అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం మంచిదేనని.. అయితే అవి కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు. తెదేపా హయాంలోనే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని కబ్జాల గురించి చిన్నపిల్లడిని అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో సుధాకర్‌రెడ్డి, పెరుగు పురుషోత్తమరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మాదేష్ పాల్గొన్నారు.
Discussion about this post