జగన్ ఐదేళ్లలో కరవు ప్రాంతమైన అనంతపురానికి చేసిందేమీ లేదని తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యేలు ఇసుక, మట్టిని అమ్ముకుని దోచుకోవడం తప్ప ఏరోజూ ప్రజల కోసం పనిచేయలేదని ఆరోపించారు. స్వర్ణాంధ్ర సాకార బస్సుయాత్రలో భాగంగా రెండోరోజు శింగనమల నియోజకవర్గం కల్లూరు, అనంతపురం నగరంలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడే కియా తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించామన్నారు. వైకాపా పాలనలో జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదని.. ఉన్నవాటిని కూడా పక్కరాష్ట్రాలకు తరిమేశారని పేర్కొన్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నగరానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధిచెప్పి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ను ఎమ్మెల్యేగా, అంబికా లక్ష్మీనారాయణను ఎంపీగా గెలిపించాలని కోరారు. అంతకుముందు కల్లూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ఎగురవేసి బండారు శ్రావణిశ్రీని అసెంబ్లీకి పంపాలని కోరారు.
source : eenadu.net
Discussion about this post