‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు.
నాలుగో రోజు శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి ఘన స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా రాతన వద్ద బస శిబిరంలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా ముఖ్యనేతలు సీఎం జగన్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
అనంతరం 10.30 గంటల ప్రాంతంలో శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. రాతన గ్రామంలో భారీ గజమాలతో, ఆనందోత్సాహాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఊరంతా∙రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరి వైఎసార్‌సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం ఇదే జిల్లా తుగ్గలికి చేరుకున్న సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని సీఎం వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో మాట్లాడారు.
source : sakshi.com
Discussion about this post