హిందూపురం నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కంచుకోటగా ఉన్నా హిందూపురం నియోజక వర్గంలో వైసిపి జెండాను ఎగుర వేద్దామని వైసిపి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని ఆర్‌ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో నియోజక వర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నవీన్ నిశ్చల్ తో పాటు ఎంపీ, ఎమ్మెల్యే అభ్వర్థులు శాంతమ్మ, దీపిక వేణురెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ, మాజీ సమన్వయ కర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, పార్టీ పరిశీలకులు రాజా రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు గతం నుంచి పార్టీకి కార్యకర్తలు అండగా ఉన్నారని, అయితే నాయకుల మధ్య సమన్వయ లోపం ఉందని అన్నారు. అయితే ఇప్పుడు కలిసి కట్టుగా ఉన్నట్లు నాయకులు చివరి వరకు ఉంటే తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. వైసిపి సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ ముందుకు సాగాలని కోరారు. కుల మతాల మధ్య చిచ్చుపెట్టే బిజెపికి ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని, దానికి తోడు అబద్ధాలు చెప్పే టిడిపి దానికి వెనుకేసుకొని వచ్చే జనసేనను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అందరం కలిసిమెలిసి పనిచేస్తే హిందూపురం నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ స్థానం కూడా గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు.
Discussion about this post