వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. ‘పది ఓట్లున్నాయా? రూ.లక్ష ఇచ్చేద్దాం.. వంద ఓట్లు వేయించే కార్యకర్తలా రూ.5 లక్షలు ఇచ్చేయండి.. మండలస్థాయి నాయకుడా? రూ.కోటి పెట్టి కొనెయ్యండి.. కాస్త పెద్ద నేతకు రూ.నాలుగైదు కోట్లయినా సరే..’ అంటూ వెదజల్లుడు కార్యక్రమం మొదలుపెట్టింది. కేవలం ఈ కొనుగోళ్ల కోసమే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు రూ.9 వేల కోట్లకు పైగా కుమ్మరించేస్తోంది. సగటున నియోజకవర్గానికి రూ.45 కోట్ల నుంచి రూ.60 కోట్లు తరలించి.. మండలానికో నాయకుడికి బాధ్యతలు కట్టబెట్టింది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ తదితర ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాలైతే ఇంకా ఎక్కువే ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఎలాగైనా గెలవాలి.. ఎంతకైనా కొనెయ్యాలనే దుష్టవ్యూహం అమలు చేస్తూ జోరుగా బేరాలు సాగిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గ నేతల నుంచి గ్రామ, బూత్‌స్థాయి కార్యకర్తల వరకు ఎవరికి ఎంత మొత్తం ఇవ్వాలో వ్యూహ బృందాలు లెక్కలేశాయి. దాన్ని అమలు చేయడమే అధిష్ఠానానికి అత్యంత దగ్గరివారైన మండలస్థాయి ముఖ్యుల పని. తమకు అప్పగించిన పని పూర్తిచేసేందుకు.. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ముందు రోజే వీరు ఆయా మండలాల్లో దిగిపోయారు.
పార్టీ అధినేతకు నమ్మకంగా ఉన్నవారినే రంగంలోకి దించారు. వీరిలో కొందరు ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు, మరి కొందరు మాజీలున్నారు. నగదు పంపిణీతోపాటు.. అభ్యర్థిని సమన్వయం చేసుకుంటూ ఇతర పార్టీల నాయకులతో బేరాలు సాగిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ పనిచేసే అధికారుల్ని ఆదేశించి తమకు కావాల్సిన వ్యవహారాలు చక్కబెట్టుకోగలిగిన స్థాయి వీరిది. ఒక్కో నాయకుడి ఆధీనంలో మండలానికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు అందుబాటులో ఉంచినట్లు చెబుతున్నారు. అయితే మండలాలకు ముఖ్యనేతల రాకపై అక్కడ పట్టున్న పార్టీ నేతలు రగిలిపోతున్నారు. ‘‘మా ప్రాంతంలో వీరి పెత్తనం ఏమిటి? మా మండలంలో ఎప్పటి నుంచో ఉంటున్న మాకు తెలియకుండా వీరు రాజకీయం చేస్తారా?’’ అనే అసంతృప్తి వారిలో వ్యక్తమవుతోంది.
నియోజకవర్గం, మండలం, గ్రామం, కాలనీ, పోలింగ్ బూత్ వారీగా.. ప్రభావం చూపగలిగే ముఖ్య నేతలు, కార్యకర్తల వారీ జాబితాలను వ్యూహ బృందాలు గతంలోనే సిద్ధం చేశాయి. ఏ ఊళ్లో ఎవర్ని కొనాలి, ఏ నాయకుడికి ఎన్ని రూ.లక్షలు, ముఖ్య కార్యకర్తలకు ఎంత ఇవ్వాలనే లెక్కలూ వేశాయి. వీటి ప్రకారం అభ్యర్థుల్ని సమన్వయం చేసుకుంటూ.. పోలింగ్ పూర్తయ్యే వరకు కార్యకలాపాలను పర్యవేక్షించడం, తమకు అప్పగించిన పంపిణీ వ్యవహారాలను పూర్తి చేయడం ఈ నమ్మిన బంటుల పని. ఇవే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కొనుగోళ్ల విషయంలో వ్యూహ బృందాలు అందించే వివరాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యనేతల కార్యాచరణలో భాగంగా.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో మూడు రోజుల నుంచి బేరాలు జోరందుకున్నాయి. ఎన్డీయే అభ్యర్థికి పోటీ ఇవ్వలేమంటూ మొన్నటి వరకు ప్రచారానికే ముఖం చాటేసిన ఉత్తరాంధ్ర, కోస్తాలోని కొందరు అభ్యర్థులు కూడా నాలుగైదు రోజులుగా కాస్త దూకుడు మీదున్నారు. ‘మీకేం భయం లేదు, అధికారగణం అండగా ఉంటుంది. ఆపై ఆర్థికంగా మేం చూసుకుంటాం’ అని అధిష్ఠానం నుంచి లభించిన ధైర్యమే దీనికి కారణంగా చెబుతున్నారు.
కిందిస్థాయిలోని కార్యకర్తలకు కూడా నిర్ణీత మొత్తం అందించాలని ముఖ్యనేతలకు సూచనలు అందాయి. ఒక కాలనీపై పూర్తి ఆధిపత్యం కలిగిన కార్యకర్తలకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు అందించే వీలుందని ఉత్తరాంధ్రకు చెందిన ఒక నాయకుడు వివరించారు. కాలనీలు, వీధుల్లో అధిక ప్రభావం కలిగిన కార్యకర్తలకు రూ.5 లక్షలు, 20 ఓట్లు వేయించే వారికి రూ.లక్ష వరకు సర్దుబాటు చేయాలనే సూచనలు అందాయి. ఎక్కడా చిన్నపాటి అవకాశాన్ని కూడా వదలొద్దని మండలస్థాయి బాధ్యతలు చూస్తున్న ముఖ్యనేతలకు ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అభ్యర్థి.. ఒక బూత్‌లో 250 ఓట్ల మెజార్టీ వస్తే రూ.15 లక్షలు ఇస్తానని చెప్పడం ఆ పార్టీ కొనుగోళ్ల తీరుకు అద్దం పడుతోంది.
source : eenadu.net
Discussion about this post