వైకాపా అధికారంలోకి వచ్చాక మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కఠోర క్రమశిక్షణతో ముస్లింలు రంజాన్ దీక్ష చేస్తారన్నారు. నిడదవోలులో వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
తెదేపా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పాటు చేశామని చంద్రబాబు గుర్తుచేశారు. కడప, విజయవాడలో హజ్ హౌస్ నిర్మించి యాత్రకు ఆర్థిక సహకారం అందించామన్నారు. రంజాన్ తోఫా ఇచ్చామని చెప్పారు. ముస్లింల వివాహానికి దుల్హన్ పథకం కింద ఆర్థిక సాయం అందజేశామని వివరించారు. మైనార్టీలకు జగన్ ఏమిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘ముస్లిం విద్యార్థులకు ప్రపంచంలో ఎక్కడైనా చదువుకునే అవకాశం ఇచ్చాం. విదేశీ చదువుల కోసం రూ.15లక్షలు ఇస్తే.. జగన్ ఆ పథకం ఆపేశారు. కడపలో హజ్ హౌస్ నిర్మాణం 90 శాతం మేం చేస్తే మిగిలిన 10 శాతం కూడా జగన్ పూర్తిచేయలేదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకే మూడు పార్టీలు కలిశాయి. వైకాపా పాలనలో మైనార్టీలపై జరిగిన దాడులు కోకొల్లలు. నాలాంటివాడినే ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. వారికి సామాన్యులు ఓ లెక్కా. నంద్యాల జిల్లాలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకునేలా వైకాపా నేతలు వేధించారు. సీఏఏకు మద్దతు తెలిపి మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్న వ్యక్తి జగన్. ఓట్ల కోసం ఆయన దొంగ జపం చేస్తున్నారు.. మోసపోవద్దు’’ అని చంద్రబాబు సూచించారు.
source : eenadu.net
Discussion about this post