‘రానున్న ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు పొందిన యువత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చంద్రబాబుకు మద్దతుగా నిలవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి కోరారు. అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అన్నివిధాలా నష్టపోయిందని.. యువత ఓటును ఆయుధంగా మలచుకుని ప్రస్తుత పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా మూడో రోజైన గురువారం ఆమె పులిచెర్ల, ఐరాల, బంగారుపాళ్యం, దామలచెరువు, చిత్తూరు నగరంలో చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక మృతి చెందిన వ్యక్తుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఆయా కుటుంబసభ్యులను పరామర్శించి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. భువనేశ్వరి వాహనశ్రేణి వచ్చే మార్గంలో పెద్దఎత్తున మహిళలు, ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. పలుచోట్ల చిన్నారులతో ఆమె ఆప్యాయంగా మాట్లాడారు. బంగారుపాళ్యం మండలంలోని మారుమూల గ్రామమైన టేకుమందలోని గోవిందయ్య కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిన భువనేశ్వరికి స్థానికులు అధిక సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. జగన్ పాలనలో చంద్రబాబు ఒక్కరే ఇబ్బంది పడలేదని.. అన్ని వర్గాలకూ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తెలిపారు. అరాచక ప్రభుత్వంపై అందరూ కలిసికట్టుగా పోరాడి గద్దె దించాలన్నారు. ఓటు విషయంలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని.. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చొరవ చూపాలన్నారు. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా జెండాను ఎగరవేయాలన్నారు.
source : eenadu.net
Discussion about this post