ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫాం-7, వివరాలను సరిదిద్దేందుకు ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26 లోపు పరిష్కరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు. వ్యక్తిగతంగా దాఖలుచేసిన ఫాం-6లను క్షుణ్ణంగా పరిశీలించాకే కొత్త ఓటర్లుగా నమోదుచేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు. ‘‘ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల కార్యక్రమాలన్నింటికీ ముందస్తు అనుమతి తప్పనిసరి. ఇందుకు నేరుగా, ‘ఎన్కోర్’ పోర్టల్ ద్వారా చేసే దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలి’’ అని సూచించారు.
‘‘ఎన్నికల సీజర్ మేనేజ్‌మెంట్ (పట్టుబడ్డ డబ్బు, మద్యం, తాయిలాల నిర్వహణ)పై ఏప్రిల్ 3న ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్), డీజీపీలతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సమీక్ష జరపనుంది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేసి, జిల్లాల పరిధిలోనే కాకుండా సరిహద్దుల్లోనూ నిఘా కట్టుదిట్టం చేయాలని సీఈఓ సూచించారు. ప్రతీ సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వెలెన్స్ బృందాన్ని ఉంచాలి. ఈసీ జారీచేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 అత్యవసర సేవల శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పించాం. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులు, పలు శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తుల మేరకు పోస్టల్ బ్యాలట్ సౌకర్యాన్ని కల్పించాలి’ అని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను సీఈఓ మీనా ఆదేశించారు.
source : eenadu.net
Discussion about this post