ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థి సవిత తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. తనను నాన్‌లోకల్ అంటూ ప్రచారం చేస్తున్న సవిత ముందు టీడీపీలో పరిస్థితి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. హిందూపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ లోకలా… నాన్‌లోకలా? మంగళగిరలో పోటీ చేస్తున్న లోకేష్ … లోకలేనా..? వీటికి సమాధానం చెప్పిన తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. మంగళవారం రొద్దం మండలం కలిపి, పెద్దమంతూరు, చెరుకూరు, చిన్నమంతూరు, నల్లూరు, చోళేమర్రి, సానిపల్లి తదితర గ్రామ పంచాయతీల్లో మంత్రి పర్యటించారు. ఈ నెల 25న తన నామినేషన్ కార్యక్రమం ఉంటుందని, నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన మేలు ఇంటింటికీ తెలపాలని సూచించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి గడపకూ వివరించాలన్నారు. వార్డు మెంబర్‌గా కూడా కాని సవితపై సీబీఐ కేసులు ఎందుకు వచ్చాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఎవరు సేవ చేయగలరో ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
సామాజిక సాధికారత జగన్ పాలనలోనే సాధ్యమైందని మంత్రి ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. టీడీపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం తప్ప ఆయా వర్గాలకు ఒరగబెట్టిందేమీలేదని ఎద్దేవా చేశారు. మంగళవారం గోరంట్ల మండలం ఖాజాపురం, మందలపల్లి, కరావులపల్లితండా, కరావులపల్లి, జావుకులదిన్న గ్రామాల్లో మంత్రి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చిన్నచూపన్నారు.
source : sakshi.com
Discussion about this post