వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద తాను ఇప్పుడు బటన్ నొక్కినా.. ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున నగదు జమ అయ్యేందుకు వారం, రెండు వారాలు అవుతుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం జగన్ తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ‘వైఎస్సార్ ఈబీసీ నేస్తం’ మూడోవిడత నిధులు విడుదల చేసి, మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మూడోవిడతలో 4.19 లక్షల మంది మహిళలకు రూ.629 కోట్లు విడుదల చేశామని, రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు వెలువడనున్న నేపథ్యంలో ముందుగానే బటన్ నొక్కుతున్నానని చెప్పారు. మూడు విడతల్లో 4.95 లక్షల మందికి ఇప్పటికి రూ.1,877 కోట్లు విడుదల చేశామన్నారు. దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించిన మోసగాడు గుర్తుకొస్తాడని, అయిదేళ్లకోసారి కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు, పవన్ మాయామాంత్రికులని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, విలువల్లేని వారు మూడు పార్టీల కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నారని, 2014లో కూడా ముగ్గురూ ఒక్కటై.. ఒకే వేదికపై కూర్చొని… మ్యానిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. అప్పట్లో వారిచ్చిన తొమ్మిది హామీలు అమలుచేయలేదన్నారు. తాను ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చానని తెలిపారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదని చెప్పారు. పేదవాడి భవిష్యత్తు బాగుపడాలన్నా, వాలంటీర్లు పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వాలన్నా, బటన్ నొక్కితే డబ్బులు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో పడాలన్నా తాను ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతాయని, మర్చిపోవద్దని జగన్ వ్యాఖ్యానించారు. పొరపాటు జరిగితే బటన్లు నొక్కడం, నేరుగా ఇంటికి వచ్చే పథకాలు ఉండవని.. పేదల బతుకులు, వారి పిల్లల చదువులు అంధకారం అవుతాయని, పేదల బతుకులు బాగుపడే పరిస్థితి నుంచి అన్యాయమైపోయే పరిస్థితి వస్తుందని.. గుర్తుంచుకోవాలంటూ హెచ్చరికలు జారీచేయడం గమనార్హం.
source : eenadu.net
Discussion about this post