జగరాజుపల్లి పంచాయతీ..పుట్టపర్తికి 16 కి.మీ దూరంలో ఉంటుంది. ధర్మవరం–గోరంట్ల ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గతంలో ఈ పేరు చెబితే ‘పల్లె కన్నీరు పెడుతోందో’ అంటూ గోరటి వెంకన్న రాసిన పాట గుర్తొచ్చేది. మోకాళ్లలోతు గుంతలు పడిన మట్టిరోడ్డు..తాగేందుకు నీరుండదు. కనీస సౌకర్యాలు కరువు. నిత్యం గ్రామస్తుల ధర్నాలు, బైఠాయింపులే. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక జగరాజుపల్లి పంచాయతీ ప్రగతివైపు పయనించింది. ప్రస్తుత ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఈ గ్రామ పరిస్థితిని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. నిధుల వరద పారించారు. ఫలితంగా రూ.3.5 కోట్లతో లింకు రోడ్డు రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి అభివృద్ధిలో జగరాజుపల్లి దూసుపోతోంది. వందేళ్లలో జరగని అభివృద్ధి ఆ ఐదేళ్లలోనే జరిగిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగరాజుపల్లిలో 547 కుటుంబాలు ఉన్నాయి. 1,472 మంది జనాభా ఉన్నారు. తొలి విడతలోనే సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని నిర్మించిన జగన్ సర్కార్ సకల సౌకర్యాలు కల్పించింది. గ్రామంలో 27 మంది నిరుపేదలకు ప్రధాన రోడ్డు పక్కనే స్థలాలు పంపిణీ చేయడంతో పాటు ఇళ్లను కూడా నిర్మించారు. సొంత స్థలం ఉన్న వారికి 56 ఇళ్లు మంజూరు చేశారు. ఆ నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల కోసం రూ.1.5 కోట్లు వెచ్చించారు. తరగతి గదుల్లో బెంచీలు, రంగులు వేయించారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. మోడల్ స్కూల్ ప్రహరీతో పాటు కేజీబీవీలో నూతనంగా 8 గదులతో అధునాతన భవనం నిర్మిస్తున్నారు. అలాగే సుమారు రూ.32.5 లక్షలతో కాలనీల్లో సిమెంటు రోడ్లు వేశారు.
source : sakshi.com
Discussion about this post