ముఖ్యమంత్రి జగన్‌కు హిందూపురం అంటే గుర్తుకు వచ్చేది ఎన్నికల సమయంలోనే. మిగిలిన సమయాల్లో ఇది రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గం అనేది గుర్తు లేదు. ఆయన ఇప్పటి దాక 2014, 2019 సంవత్సరాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మరో సారి 5 ఏళ్ల తరువాత శనివారం ఓట్ల కోసం పట్టణానికి వస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నేరవేర్చలేదు. హిందూపురానికి ఒక్కటంటే ఒక్క పనీ చేయలేదు. అభివృద్ధి పనుల కోసం రూపాయీ మంజూరు చేయలేదు. కానీ, అనేక రూపాల్లో ప్రజలపై భారం మోపారు. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రం చేస్తానని చెప్పి, చివరకు పార్లమెంటు కేంద్రమైన, రెండు లక్షల జనాభా ఉన్న హిందూపురాన్ని వదిలేసి పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేశారు. ఎన్టీఆర్ హయాంలో ఇక్కడ పెట్టిన అనేక జిల్లాస్థాయి కార్యాలయాలనూ ఇతర ప్రాంతాలకు తరలించారు.
పురానికి పక్కనే కర్ణాటక రాష్ట్రం ఉంది. ఇక్కడికి సమీపంలోనే కర్ణాటక ప్రభుత్వం పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ప్రోత్సహించడంతో పరిశ్రమలు అక్కడికి వెళ్లిపోయాయి. పారిశ్రామికవాడకు గత 5 ఏళ్లలో కనీస సదుపాయాలు కల్పించలేదు. హిందూపురానికి మంజూరైన మెడికల్ కళాశాలను పెనుకొండకు తరలించారు. విద్యకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నామని చెప్పినా, ప్రభుత్వ బాలుర డిగ్రీ, జూనియర్ కళాశాలలకు అధ్యాపకులను నియమించకపోవడంతో మూతపడ్డాయి. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో వేలాది ఎకరాలను చిలమత్తూరు మండలంలో సేకరించి రైతుల పొట్టకొట్టారు. తమకు కావాల్సిన వారికి విలువైన భూములను ధారాదత్తం చేశారు. ఎకరా కోటి రూపాయలు పలికే భూమిని నామమాత్రంగా రూ.1.75 లక్షలకు తీసుకొన్నారు. అయితే ఈ ప్రాంత అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోలేదు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలో ఏటా జరిగే ఉత్సవాలను సైతం నిలిపివేశారు. యునెస్కో గుర్తింపు తీసుకురాలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలో రూ.76 కోట్లతో ప్రతిపాదించిన అంతర్గత నీటి సరఫరా వ్యవస్థ పనులను అటకెక్కించారు. దీంతో పట్టణంలో నీటి సమస్య పరిష్కారం కాలేదు. రూ.66 కోట్లతో బాలయ్య ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిపివేశాయి. రూ.155 కోట్లతో నిర్మించిన టిడ్కో భవనాలను లబ్దిదారులకు అప్పగించకుండా వదిలేశారు. దీంతో అవి శిథిలావస్థకు చేరుతున్నాయి. మరో వైపున జగనన్న కాలనీలంటూ ఆర్భాటం చేసినా, ఒక్క ఇంటిని నిర్మించలేదు. హిందూపురం నియోజకవర్గంలో 10 వేలమంది చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి ప్రోత్సాహం లేదు. దీంతో మగ్గాలు మూత పడుతున్నాయి. పట్టణంలో ఏటా 15 శాతం ఆస్తి పన్ను పెంచి, పట్టణ ప్రజలపై భారం మోపారు. కొత్తగా చెత్త పన్ను విధించారు. అయినా నియోజకవర్గ అభివృద్ధికి 5 ఏళ్లలో ఒక్క రూపాయీ విడుదల చేయలేదు. రోడ్ల మీద పడిన గుంతలను పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది.
హిందూపురం అంటేనే పట్టు, పాడి పరిశ్రమకు పేరు. ఆ రైతులకు సహకరించకపోగా వారి పరిస్థితిని మరింత దిగజార్చారు. పట్టు రైతులకు అనేక రకాల ప్రోత్సాహకాలు తెదేపా హయాంలో ఉండేవి. ఇవికాక కిలో పట్టుగూళ్లకు రైతుకు రూ.100 నగదు ప్రోత్సాహం ఇచ్చేవారు. నిబంధనల కారణంగా ఇవ్వకపోవడంతో పట్టు రైతులకు చంద్రబాబు రూ.3 కోట్లు బకాయిలు పెట్టారని, తానైతే మరింత అదనంగా ఇస్తానని జగన్ గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లుగా పట్టు గూళ్లకు ప్రోత్సాహం సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.60 కోట్లకు చేరాయి. పట్టు పరిశ్రమ ప్రోత్సాహానికి గత ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలను ఎత్తివేశారు. పాడి పరిశ్రమను ఆదుకొంటానని హామీ ఇచ్చారు. చివరకు నడుస్తున్న డెయిరీని మూసివేశారు. అమూల్‌కు అప్పగించినా.. అది తెరుచుకోలేదు. దీంతో పాడి పరిశ్రమ దెబ్బతింది. హిందూపురానికి పరిశ్రమలు తీసుకొస్తానని, ఉపాధి కల్పిస్తానని చెప్పినా, ఒక్క పరిశ్రమా రాలేదు. ఉన్నవాటికి ప్రోత్సాహం లేక మూతపడ్డాయి. రహేజా వస్తోందంటూ హడావుడి చేసినా, అడుగు ముందుకు పడలేదు.
source : eenadu.net
Discussion about this post