అమరావతిపై ఎందుకు మాట మార్చారు?
2004 నుంచి ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు
జనసేనలో చేరిన సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి
‘నేడు రూ.వందల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘సిద్ధం’ అని జగన్ హోర్డింగులు కన్పిస్తున్నాయి. దేనికి సిద్ధం జగన్.. పారిపోవడానికా..? దేవుడున్నాడని అంటున్నారు, మీ ఒక్కరికే కాదు, షర్మిలకు, సునీతకు, మా అందరికీ దేవుడున్నాడు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలిచ్చి ఇప్పుడు వాటిని తుంగలో తొక్కారు. ఈ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతారు జగన్?’ అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నిలదీశారు. ఆయన ఆదివారం జనసేనాని పవన్‌కల్యాణ్ సమక్షంలో వేలమంది అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిని, ప్రభుత్వ తప్పిదాలను నిలదీశారు. ప్రసంగం ఆయన మాటల్లోనే..
జగన్.. మీ గురించి మొత్తం తెలుసు
జగన్.. మీరు చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పను అంటున్నారు. అదే మీరు చెప్పే పెద్ద అబద్ధం. ప్రతిపక్షంలో ఉన్నపుడు గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారు. రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులమైన మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లడగండని చెప్పారు. మీ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అభాసుపాలు చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? మీ ప్రభుత్వంలో చేసిన పనులకు నిధులు రాక, టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేని దుస్థితి కల్పించారు. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. పెద్దపెద్ద విషయాలు చాలా ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలేమీ లేవు. అయితే, నేను క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడిని.
వైకాపా విముక్త ఏపీయే లక్ష్యం
రానున్న రెండు నెలలు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ‘విభజన సమయంలో రాష్ట్ర ఎంపీల అసమర్థత వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాలేదు. ఈ తరుణంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలన్న పవన్ ఆలోచనా విధానానికి బాలశౌరి పునాది కావాలి. రాష్ట్రానికి న్యాయం చేయడానికే కేంద్రంతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తున్నామ’ని మనోహర్ వెల్లడించారు.
source : eenadu.net
Discussion about this post