వాటిని ఎవరూ తొలగించలేరు.. ఏడాదికి రూ.52,700 కోట్ల ఖర్చు
అఖండ మెజారిటీతో గెలుస్తాం, పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం
శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి
‘వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా.. పింఛన్లు, ఉచిత విద్యుత్తు, రాయితీ బియ్యం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతిదీవెన, గోరుముద్ద, సంపూర్ణ పోషణ తదితర 8 సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలుచేయాల్సిందే.. వాటిని ఎవరూ తొలగించలేరు. వాటి అమలుకు ఏటా రూ.52,700 కోట్ల ఖర్చవుతుంది’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘భవిష్యత్తుకు గ్యారంటీ అంటూ చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల్ని అమలుచేయాలంటే ఏడాదికి రూ.73,340 కోట్లు కావాలి. 8 పథకాలకు అయ్యే వ్యయం కూడా కలిపితే మొత్తం ఏడాదికి రూ.1,26,140 కోట్లు అవసరం. ఏడాదికి సగటున రూ.70వేల కోట్లతో అమలుచేయడానికే మేం కిందా మీదా పడుతున్నాం. చంద్రబాబేమో ఏడాదికి రూ.1.26 లక్షల కోట్లతో సంక్షేమం ఇస్తామంటున్నారు. ప్రకటించినవి శాంపిల్ మాత్రమే అని, ఇంకా పథకాలు వస్తాయంటున్నారు. ఎలా అమలుచేస్తారు? అదేమంటే చంద్రబాబు సంపద సృష్టిస్తానంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏటా రెవెన్యూ లోటే’ అని విమర్శించారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసనసభలో మంగళవారం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.
రాష్ట్ర ఆదాయం, ఖర్చులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన 6 హామీలు, వాటికి అయ్యే ఖర్చుల వివరాలను తెలిపారు. ‘అధికారంలోకి వచ్చాక ఆరో బడ్జెట్ పెడుతున్నాం. ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్టే. మరో మూడు నెలల్లో ఇదే చట్టసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం, అఖండ మెజారిటీతో ప్రజల మన్ననలు పొందుతాం. ‘ఒక జాతీయ పార్టీతో ప్రత్యక్షంగా, మరో జాతీయ పార్టీతో పరోక్షంగా అవగాహన కుదుర్చుకుని.. కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షం ఉంది’ అని ధ్వజమెత్తారు.
కేంద్రంలో ఎవరొచ్చినా.. పూర్తి మెజారిటీ రాకూడదు
కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా.. వారికి పూర్తి మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నామని, మనపై ఆధారపడే ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశ ఇందుకు కారణమని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయి నష్టపోయాం. 58% ప్రజలున్న ఆంధ్రప్రదేశ్‌కు తక్కువ ఆదాయం, 42% ప్రజలున్న తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తోంది. విభజన కారణంగా ఏడాదికి రూ.13వేల కోట్ల చొప్పున ఈ పదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు కోల్పోయాం. కొవిడ్ కారణంగా 2019-22 మధ్య రూ.66వేల కోట్ల ఆదాయం కోల్పోయాం. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం.. కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రానికి 41% ఇవ్వాల్సి ఉంటే, 31.5% మాత్రమే వచ్చింది’ అని వివరించారు.
అప్పులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
తెదేపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. గత అయిదేళ్లలో రాష్ట్ర రాబడులు తగ్గాయని, ఎన్నో సవాళ్లతో పాలన సాగించామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అయినా ఇచ్చిన హామీల్లో 99% అమలుచేశాం. రాష్ట్రం అప్పులు చేసిందంటూ ఎవరి నోటికి వచ్చినట్లు వారు లెక్కలు చెబుతున్నారు. అయిదేళ్లలో చేసిన అప్పులు రూ.2,91,184 కోట్లు మాత్రమే. తెదేపా హయాంలో ఏటా ఆర్థికసంఘం విధించిన పరిమితికి మించి అప్పులు చేయగా.. మా ప్రభుత్వ హయాంలో ఇంకా తక్కువే చేశాం. నేరుగా చేసినవి, ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చినవి, గ్యారంటీ లేకుండా తీసుకున్న అప్పులు కలిపి.. రాష్ట్ర విభజన నాటికి రూ.1.53 లక్షల కోట్ల రుణాలున్నాయి. 2015-19 మధ్య ఇవి రూ.4.12 లక్షల కోట్లకు చేరాయి. 2024 నాటికి రూ.7.03 లక్షల కోట్లకు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే మేం చేసిన అప్పులు తక్కువే. మూలధన వ్యయం కింద రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేయట్లేదన్నది అబద్ధం. 2015-19 మధ్య ఏడాదికి రూ.15,227 కోట్లు ఖర్చు చేయగా.. గత 57 నెలల్లో ఏడాదికి సగటున రూ.17,757 కోట్లు ఖర్చుపెట్టాం. పోర్టుల నిర్మాణం కూడా కలిపితే ఇంకా ఎక్కువే అవుతుంది’ అని తెలిపారు.
source : sakshi.com
Discussion about this post