వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన వైఎస్ అవినాష్‌రెడ్డిని సీఎం జగన్ మరోమారు వెనకేసుకొచ్చారు. అవినాష్ ఏ తప్పూ చేయలేదని బలంగా నమ్ముతున్నాను కాబట్టే టికెట్ ఇచ్చానంటూ క్లీన్‌చిట్ ఇచ్చేశారు. చిన్నాన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవమా.. కాదా? ఆమెతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవమా.. కాదా? అని ప్రశ్నిస్తూ.. వివేకా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. తన తండ్రి హంతకులకు, హత్య కుట్రదారులకు శిక్షపడేలా, వారిని కాపాడుతున్నవారి తీరును ఎండగడుతున్న సునీతపై, ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలపై అత్యంత హేయమైన భాష ఉపయోగించారు. ‘పసుపు చీర కట్టుకుని వెళ్లి మోకరిల్లారు’ అంటూ షర్మిలను ఉద్దేశించి నీచంగా వ్యాఖ్యానించారు. పులివెందులలో గురువారం నామినేషన్ వేసిన సందర్భంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడారు. అవినాష్ చిన్న పిల్లోడని, ఆయన జీవితాన్ని నాశనం చేయాలని పెద్ద పెద్దోళ్లంతా కుట్రలో భాగస్వాములవుతున్నారంటే నిజంగా వీళ్లు మనుషులేనా అనే సందేహం కలుగుతోందంటూ మాట్లాడిన జగన్… అవినాష్‌కు తాను అండగా ఉన్నాననే విషయాన్ని చెప్పకనే చెప్పారు. వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారే.. తెలిస్తే మీరే ఆ పేరు ఎందుకు చెప్పట్లేదు?
జగన్: అవినాష్ ఏ తప్పూ చేయలేదని బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేనివారంతా చిన్నపిల్లాడైన అవినాష్‌ను దూషిస్తూ, తెరమరుగు చేయాలనుకోవడం దారుణం.
సీబీఐ లాంటి ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థే.. వివేకా హత్యకు కుట్రపన్నింది, హత్యానంతరం సాక్ష్యాలు ధ్వంసం చేసింది అవినాష్‌రెడ్డేనని అభియోగపత్రంలో వెల్లడిస్తే ఆయన తప్పు చేయలేదని నమ్ముతున్నట్లు చెప్పడమేంటి? అంటే సీబీఐ చెప్పినదాని కంటే మీ నమ్మకమే ప్రధానమా? ఇది దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా?
జగన్: చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా.. కాదా? రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవమా.. కాదా?
‘మా చిన్నాన్న అంతటి సౌమ్యుడు ఎవరూ లేరు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆయన సొంతం. అలాంటి వ్యక్తిని అన్యాయంగా చంపేశారు’ అంటూ అప్పట్లో మాట్లాడిన మీరే ఇప్పుడు.. వివేకా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బహిరంగ వేదికలపై మాట్లాడుతున్నారంటేనే.. మీ వైఖరి ఏంటో అర్థమైపోతోంది.
జగన్: బురద చల్లేందుకు నా ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనక ఎవరున్నారో అందరికీ రోజూ కనిపిస్తోంది.
సీబీఐ అభియోగపత్రంలో ఉన్న అంశాలు, దర్యాప్తులో తేల్చిన విషయాల్నే సునీత, షర్మిల ప్రజలకు వెల్లడిస్తుంటే.. అది బురద చల్లడం ఎలా అవుతుంది? తన తండ్రి హంతకులకు, హత్య కుట్రదారులకు శిక్షపడేలా, వారిని కాపాడుతున్నవారి తీరును ఎండగడుతున్న సునీతపై, ఆమెకు మద్దతుగా నిలిచిన షర్మిలపై అత్యంత హేయమైన భాషతో దాడి చేస్తున్నది ఎవరో అందరికీ కనిపిస్తోంది. న్యాయం కోసం పోరాడుతున్న సొంతింటి ఆడబిడ్డలకు అండగా ఉండాల్సింది పోయి.. వారిపై బురద చల్లుతున్నది, చల్లిస్తున్నది ఎవరో అందరి కళ్లకూ కడుతోంది. చివరికి చెల్లెమ్మలు అని కూడా చూడకుండా… వారిపై మీరు ఉపయోగించిన భాష చూస్తేనే బురద చల్లుతున్నది ఎవరో స్పష్టమవుతోంది.
జగన్: పసుపు చీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి, వారి కుట్రలో భాగమయ్యారు. వీళ్లా వైఎస్‌ఆర్ వారసులు? (తన సోదరి వైఎస్ షర్మిలను ఉద్దేశించి)
సొంత చెల్లెలి వేషధారణ, ఆమె కట్టుకున్న చీర రంగును ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? సొంత సోదరిని ఉద్దేశించి ‘ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లారు’ అనే హేయమైన భాష ఉపయోగించిన మీరా… ఈ రాష్ట్ర మహిళలకు అన్ననని చెప్పుకొనేది! షర్మిలపై మీరు చేసిన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే.
జగన్: వివేకం చిన్నాన్నను చంపిన హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నారు. ఆయనకు మద్దతిస్తున్నదెవరో అందరూ రోజూ చూస్తున్నారు.
వివేకా హత్యకేసులో 8వ నిందితుడైన అవినాష్‌రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నారు. ఆయన స్వేచ్ఛకు కారణం ఎవరో ప్రజలందరూ రోజూ చూస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఒక్కో తీగ లాగుతూ… అవినాష్ ప్రమేయాన్ని బయటపెట్టే సమయంలో దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు. అవినాష్‌ను సీబీఐ అనుమానితుడిగా గుర్తించగానే ‘ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా?’ అని ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చేస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా మీరే అసెంబ్లీలో మాట్లాడారు. అవినాష్ జైలుకు వెళ్లకుండా అడ్డుకున్నది ఎవరో, ఆయన నిందితుడని తేలాక పదేపదే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయిస్తూ చిక్కులు కల్పించింది ఎవరో ప్రజలందరూ చూశారు. వాటన్నింటినీ దాటుకుని ఆయన్ను అరెస్టు చేయడానికి సీబీఐ అధికారులు కర్నూలు వెళ్లగా.. వారికి సహాయనిరాకరణ చేసింది ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా?
source : eenadu.net
Discussion about this post