ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)పై వైకాపా రాజకీయ స్వారీ చేస్తోంది. ఏసీఏలో అవినీతి జరిగిందంటూ బెదిరింపులతో పాత సభ్యులను ఇప్పటికే బయటకు పంపింది. ఎంపీ విజయసాయిరెడ్డి బంధుగణం, అనుచరగణం చేతుల్లోకి ఏసీఏ వెళ్లిపోయింది. ఇందులో అక్రమాలపై ప్రశ్నించేవారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోంది. అవినీతిపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులనుంచి ఆయనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ప్రెస్‌మీట్ పూర్తయ్యాక ‘నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించినట్లు మూర్తియాదవ్ తెలిపారు. మరోవైపు.. శనివారం విశాఖకు రానున్న బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌బిన్నీ, కార్యదర్శి జయ్‌షాకు ఏసీఏలో అక్రమాలపై ఫిర్యాదు చేయడానికి కొందరు సిద్ధమయ్యారు.
స్టేడియం పేరుతో వ్యూహం
భోగాపురం వద్ద వైకాపా నేత కుటుంబసభ్యులు 500 ఎకరాలు కొన్నారు. ఆ భూముల విలువ పెంచుకోవడానికి పన్నాగం పన్నారు. మధురవాడ స్టేడియంకంటే అధిక సామర్థ్యంతో భారీ స్టేడియం నిర్మిస్తామని, ఇందుకు అవసరమైన 40 ఎకరాలను కేటాయించాలంటూ ప్రభుత్వానికి గుట్టుచప్పుడు కాకుండా ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రతిపాదిత భూమి సమీపంలోనే వైకాపా నేత భూములున్నట్లు సమాచారం.ప్రస్తుతం మధురవాడలో ఉన్న ఏసీఏ-వీడీసీఏ స్టేడియాన్ని షాపింగ్‌కాంప్లెక్సుగా మార్చి దీర్ఘకాలం ఆ నేత అనుచరగణమే లీజుకు దక్కించుకోవాలన్న ఆలోచనతో ప్రణాళిక రచించినట్లు క్రీడాభిమానులు భావిస్తున్నారు.
జగన్ మెప్పునకు ప్రచారాలు
కోర్టు ధిక్కరణ కేసులో శుక్రవారం హైకోర్టులో ఏసీఏపై విచారణ జరిగింది. క్రికెట్ అవసరాలకు, జీతభత్యాలకు తప్ప వేటికీ నిధులు ఖర్చు చేయొద్దని హైకోర్టు గతంలో ఆదేశించింది. ప్రస్తుతం ఈ స్టే ఉండగానే రూ.80 కోట్ల వరకు నిధులు డ్రా చేశారన్న ఆరోపణలున్నాయి. మెన్, ఉమెన్ ఏపీఎల్ నిర్వహించామని.. మైదానాలు సిద్ధం చేశామని, రోడ్లు వేశామని, ఫ్లడ్‌లైట్లు, కుర్చీలు మార్పు చేశామని చెబుతున్నారు. క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారీ తెరలను ఏర్పాటుచేసి జగన్ చిత్రాలను ప్రదర్శించడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఏసీఏకు స్టే ఇచ్చినప్పటినుంచి దేనికి ఎంత ఖర్చు పెట్టారో పూర్తి వివరాలు అందించేందుకు కోర్టు రెండు వారాల గడువు విధించింది.
source : eenadu.net
Discussion about this post