రాష్ట్రంలో అనేక పథకాలకు తన పేరో లేక తన తండ్రి పేరో పెట్టుకుంటున్న జగన్ ఇప్పుడు వైద్య కళాశాలలనూ వదల్లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 17 వైద్య కళాశాలలకు మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) పేరు పెడుతూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా సంస్థకు లేదా నిర్మాణానికి భారీగా విరాళం ఇస్తేనో.. భూములు దానంగా ఇస్తేనో వారి పేర్లు పెడతారు. కానీ, ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతో నిర్మిస్తున్న కళాశాలలకు జగన్.. సొంత ఆస్తుల్లా తన తండ్రి వైఎస్ పేరు పెట్టారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా 17 వైద్య కళాశాలలకు ఆయన పేరుపెట్టారు. నిజానికి పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్యశ్రీకి కేంద్రం నిధులు ఇస్తున్నా మోదీ ఫొటో కూడా పెట్టకపోవడం ఏమిటని ఇటీవల కేంద్రమంత్రి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 1,500 కోట్ల నిధులు ఆపేస్తామని కేంద్రం హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మోదీ చిత్రం, కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన చిహ్నాన్ని పెట్టింది. తాజాగా కేంద్ర నిధులతో నిర్మిస్తున్న కళాశాలలకు వైఎస్ నామకరణం చేసింది. వైఎస్ ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న సమయంలో వైద్యం కోసం ఎంతో కృషి చేసినందున ఆయన పేరు పెడుతున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
source : eenadu.net
Discussion about this post