విశ్వవిద్యాలయాలకు సాధారణంగా గవర్నర్ కులపతి(ఛాన్స్‌లర్)గా ఉంటారు.. కానీ, ఇప్పుడు రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌జీయూకేటీ కులపతిగా సీఎం ఉండేందుకు వీలుగా తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. మరో రెండు సవరణ బిల్లులకూ ఆమోదం లభించింది. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో అక్కడి గవర్నర్లు, ప్రభుత్వాలకూ మధ్య విభేదాలు తలెత్తడంతో అన్ని వర్సిటీలకు ముఖ్యమంత్రులే కులపతులుగా ఉండేలా చట్టానికి సవరణలు చేశారు. ఏపీలో ట్రిపుల్ ఐటీల కోసం ఏర్పాటు చేసిన ఆర్‌జీయూకేటీకి ముఖ్యమంత్రి కులపతిగా ఉండేలా ఇప్పుడు చట్టాన్ని సవరించారు.
ఆర్‌జీయూకేటీ ఆరేళ్ల ఇంజినీరింగ్ కోర్సును అందిస్తుంది. గవర్నర్ కులపతిగా ఉంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నుంచి నిధులు వచ్చేందుకు ఎలాంటి ఆటంకాలూ ఉండవని, ముఖ్యమంత్రి కులపతిగా ఉంటే యూజీసీ నిధులు వచ్చేందుకు సమస్య ఏర్పడుతుందని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. సీఎం కులపతిగా ఉండడం వల్ల వర్సిటీల్లోనూ రాజకీయ కార్యకలాపాలు, ఉన్నతాధికారుల పెత్తనం పెరిగిపోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపకులపతులు డమ్మీగా మారితే వర్సిటీ ప్రతిభ మసకబారుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. వైకాపా ప్రభుత్వం నాలుగున్నరేళ్లల్లో ఈ వర్సిటీకి ఉపకులపతినే నియమించలేదు. ఇన్‌ఛార్జులతోనే నెట్టుకొస్తున్నారు.
పేదలకు ఇచ్చిన ఇంటి స్థలం పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు
పేదలకు ఇచ్చిన ఇంటి స్థలానికి పదేళ్ల అనంతరం భూ యాజమాన్య హక్కు కల్పించే సవరణ బిల్లును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రభుత్వం మహిళల పేరిట ఇచ్చిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకొని, పదేళ్ల తర్వాత అమ్ముకునేందుకు వీలుంటుందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఇతర విధానాల్లో చేరిన వారిలో క్రమబద్ధీకరణ పొందిన ఉద్యోగులకు.. అంతకు ముందున్న సర్వీసును పింఛను ప్రయోజనాలకు లెక్కించకూడదనే సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి దీన్ని ప్రవేశపెట్టారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ సవరణ చేసినట్లు ఆయన తెలిపారు.
source : eenadu.net
Discussion about this post