‘ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మంత్రులు వారి అధికారిక వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఆ పర్యటనల్లో వారు ప్రభుత్వ అతిథిగృహాల్లో ఉండటానికి వీల్లేదు. బీకన్ లైట్లు కలిగి ఉన్న పైలట్ కార్లు (బుగ్గ కార్లు), తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలనూ వాడకూడదు’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమల్లోకి వచ్చేస్తుందని అన్నారు. ఆ క్షణం నుంచే.. ప్రభుత్వ విజయాల పేరిట ప్రజాధనం వెచ్చించి ఇచ్చే ప్రకటనలను నిలిపేయాలని ఆదేశించారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లలో ఉన్న మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, రాజకీయ పార్టీల ప్రస్తావనలు మొదలైనవన్నీ తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్ నిర్దేశించే మార్గదర్శకాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. దానిలో ప్రధానాంశాలివీ..
ప్రభుత్వోద్యోగులు ప్రచారంలో పాల్గొనరాదు
ప్రభుత్వోద్యోగుల ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీకీ, అభ్యర్థికీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు, ఆరోపణలకు ఆస్కారమివ్వకూడదు. ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్నా, పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందినా, అనుచితంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా అది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వోద్యోగులపై ఐపీసీ సెక్షన్ 171, 123తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134, 134ఏ సెక్షన్ల కింద చట్టపరమైన, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం.
భార్య/భర్త రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ సెలవు లేదా పర్యటనలపై వెళ్లాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే.
ఎన్నికల నిర్వహణతో సంబంధమున్న అధికారుల బదిలీలపై నిషేధం ఉంటుంది.
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఇతర రాజకీయ నాయకుల ఫొటోలేవీ ప్రభుత్వ భవనాల్లో ప్రదర్శించకూడదు.
మంత్రులు, రాజకీయ నాయకులెవరూ అధికారులతో వ్యక్తిగతంగా, సామూహికంగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నప్పుడు వివిధ పథకాల లబ్ధిదారులకు పంపిణీ చేసే లబ్ధిదారుల కార్డులు, శిలాఫలకాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు, వారి సందేశాలు ఉండకూడదు.
ఎంపీ, ఎమ్మెల్యే ల్యాడ్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్‌లు, అంబులెన్స్‌లు తదితరాలపై ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల చిత్రాలను కనిపించకుండా మూసేయాలి.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చాక ఇచ్చే విద్యుత్తు, వాటర్ బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తదితర వాటిపై రాజకీయ నాయకుల ఫొటోలు, పేర్లు, పార్టీల చిహ్నాలు వంటివేమీ ఉండకూడదు.
అభివృద్ధి, నిర్మాణ ప్రాజెక్టులతో సంబంధమున్న ప్రభుత్వ విభాగాలు వాటి పరిధిలో ఇప్పటికే మొదలైన, మొదలుపెట్టాల్సిన పనుల జాబితాను ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 72 గంటల్లోగా ఎన్నికల సంఘానికి తెలియజేయాలి.
కటౌట్లు తొలగించాల్సిందే..
ప్రభుత్వ ఆస్తులపై ఉన్న రాజకీయ నాయకుల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, గోడ రాతలు, పార్టీల జెండాలు తదితరాలను 24 గంటల్లోగా తొలగించాలి.
బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రైల్వే బ్రిడ్జిలు, రోడ్లు, ప్రభుత్వ బస్సులు, ఆర్టీసీ బస్సులు, విద్యుత్తు స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ నాయకుల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, గోడ రాతలు, పార్టీల జెండాల వంటి వాటిని 48 గంటల్లోగా తీసేయాలి.
ప్రభుత్వ ఖజానా నుంచి నిధుల్ని వెచ్చించి.. రాజకీయ నాయకులు, పార్టీల విజయాలు తెలిపేలా పేర్లు, ఫొటోలు, పార్టీ చిహ్నాలతో ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, ప్రకటనలను తొలగించాలి.
source : eenadu.net
Discussion about this post