‘వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లందరూ వైకాపా గెలుపునకు కృషి చేయాలి. దీనికిగానూ ప్రతి ఒక్కరికి నెలకు రూ. 30 వేల వరకు ఇస్తాం. మీ పరిధిలో ఉన్న 50 ఇళ్లలోని ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి’ అంటూ అధికార పార్టీ నాయకులు వాలంటీర్లతో బేరాలకు దిగడం వివాదాస్పదంగా మారింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ పరిధిలోని సచివాలయ ప్రాంగణంలో సమావేశం ఉందని బుధవారం వాలంటీర్లకు సమాచారం అందింది. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అనుచరుడైన ఓ వాలంటీరు కూడా వెళ్లారు. వైకాపా నాయకులు ఆయనను దుర్భాషలాడుతూ సమావేశం నుంచి వెళ్లగొట్టారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానిక పోలీసుస్టేషన్‌లో తెదేపా, వైకాపా నాయకులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ సమావేశంలో చెప్పే విషయాలు రికార్డింగ్ చేయకుండా.. ముందుగానే వాలంటీర్ల ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్ చేయడం గమనార్హం.
ఆర్డీవోకు ఫిర్యాదు.. వీడియోలు అందజేత
వైకాపా ఇన్‌ఛార్జులుగా చెప్పుకొనే ఇద్దరు, ఎంఎల్‌వోలుగా చెప్పుకొనే థర్డ్ పార్టీ ఏజెన్సీకి చెందిన దాసరి రాజేశ్, సర్వేపల్లి శ్రీనివాసుతో పోల్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ ఇప్పిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపించారు. ‘ఓటర్లను ఎలా ప్రలోభ పెట్టాలో చెబుతున్నారని, వైకాపా అధికారంలోకి రాకపోతే.. సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రచారం చేయాలంటూ వాలంటీర్లపై ఒత్తిడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘వైకాపా గెలుపునకు కృషి చేస్తే నెలకు రూ.30 వేల వరకు ఇస్తాం’ అని అధికార పార్టీ డివిజన్ ఇన్‌ఛార్జీలు మభ్యపెడుతున్నారని.. దీనిపై కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవోకు ఫిర్యాదు చేసి వీడియో ఆధారాలు అందజేశామని తెదేపా నాయకులు తెలిపారు.
source : eenadu.net
Discussion about this post