చిత్రంలో కనిపిస్తున్నవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సోములవారిపల్లె- 2, 4 గ్రామ సచివాలయాలు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని గ్రామసచివాలయాలను యుద్ధప్రాతిపాదికన ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఇటీవల సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ఉమ్మడి కడప జిల్లాల పరిధిలో 73 గ్రామ సచివాలయాలు, 89 రైతు భరోసా కేంద్రాలు, 74 హెల్త్ క్లీనిక్‌లను ప్రారంభించాల్సిన జాబితాలో చేర్చారు. ఎమ్మెల్యేల చేతుల మీదుగా ప్రారంభించాలని, అలా వీలుకాకపోతే సచివాలయాల సిబ్బంది నేరుగా భవనాల్లోకి చేరిపోవాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టరు విజయరామరాజు దిశానిర్దేశం చేశారు. దీంతో ఈ నెల 15వ తేదీలోగా సచివాలయాలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్ హెల్త్‌క్లినిక్‌ల భవన నిర్మాణాలు చేపట్టింది. స్థలాల కొరత, నిధుల లేమి, గిట్టుబాటు కాని నిర్మాణ సామగ్రి ధరలు, ముందుకురాని గుత్తేదారులతో గత నాలుగేళ్లుగా నత్తనడకన నిర్మాణాలు సాగాయి. ‘ఎన్నికల కోడ్ రాకముందే నిర్మాణం పూర్తయిన భవనాలను ఎమ్మెల్యేల చేతులు మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. వీల్లేని చోట్ల సంబంధిత సచివాలయాల సిబ్బంది నేరుగా కొత్త భవనాల్లోకి చేరిపోవాల్సిందే. కలెక్టరు ఆదేశాల మేరకు నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేస్తాం.’ అని పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
source : eenadu.net
Discussion about this post