రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలన్న ఆలోచన అంతకన్నా లేదు! పరిశ్రమల్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించాలన్న పట్టుదల అసలే లేదు! ఎంతసేపూ అందినకాడికి దండుకోవడం, ప్రజల్ని మభ్యపెట్టో, ప్రలోభపెట్టో మరోసారి అధికారంలోకి వచ్చేయాలనుకోవడం ఇదే ముఖ్యమంత్రి జగన్ ఎజెండా. ఆయన శనివారం ప్రకటించిన మ్యానిఫెస్టోనే దీనికి నిదర్శనం. రాజకీయ పార్టీ ప్రకటించే మ్యానిఫెస్టో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అద్దంపట్టే దార్శనికపత్రంలా, భవిష్యత్తుకు భరోసానిచ్చే ప్రణాళికలా ఉండాలి. వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ లక్షణాలేమీ లేవు. ఐదేళ్లుగా విధ్వంసమే ఎజెండాగా పాలించిన ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించడం, యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన వంటివి ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు ప్రవర్తించారు. రాష్ట్రానికి దీర్ఘ కాలంలో ఉపయోగపడే ఆస్తుల కల్పనపై నిధులు వెచ్చించడం (మూలధన వ్యయం) అనే పదమే జగన్‌కు గిట్టదు. రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కల్పన అసలే నచ్చదు. జగన్ ఇప్పుడు ప్రకటించిన మ్యానిఫెస్టో కూడా ఐదేళ్ల విధ్వంసక పాలనకు కొనసాగింపులా ఉందే తప్ప.. చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని, రాష్ట్రాభివృద్ధిని గాడిన పెట్టే ఆలోచన, తాపత్రయం ఏ కోశానా కనిపించడం లేదని వివిధ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
source : eenadu.net
Discussion about this post