రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం పాకులాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి చెప్పారు. జనసేనతో జతకట్టినా చంద్రబాబుకు ఘోర ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం జగన్కు ప్రజల్లో వ్యతిరేకత ఉందని చంద్రబాబు భావిస్తే ఒంటరిగా పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.
ఆయన మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయతను సీఎం వైఎస్ జగన్ మరింత పెంచుకున్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ పొత్తులకు వ్యతిరేకమని, ఒంటరిగా పోటీ చేయడమే తమ విధానమని అన్నారు. ఎన్నికల్లో అమలు చేయగలిగిన హామీలే ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం, నిత్యం జనంతో మమేకమవడం, ప్రజలకు మంచి చేయడం, మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని ప్రజలను కోరడమే సీఎం జగన్ సిద్ధాంతమని తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసే చంద్రబాబును ప్రజలు నమ్మరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యమని, ప్రజలకు మరింత మేలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బిల్లులకు మద్దతు తెలిపామని ఆయన చెప్పారు. సెక్యులర్ భావనకు విఘాతం కలిగించే ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులను వైఎస్సార్సీపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు.
source : sakshi.com
Discussion about this post