నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానని పుట్టపర్తి శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. హంద్రీనీవా జలాలతో నియోజకవర్గంలోని 193 చెరువులను నింపడమే తన ధ్యేయమన్నారు. శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండలం కేశాపురం ద్వారం వద్ద అభ్యర్థి పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పల్లె కృష్ణకిశోర్‌రెడ్డికి తెదేపా శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. నాయకులు, కార్యకర్తలు బాణ సంచా కాల్చి, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ, కేరింతలు కొడుతూ.. పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. నాలుగురోడ్ల కూడలికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలతో కలిసి ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. కేశాపురం నుంచి కొత్తచెరువు, బుక్కపట్నం మీదుగా పుట్టపర్తి వరకు ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. మండుటెండలో ప్రసంగించే సమయంలో సింధూర సొమ్మసిల్లడంతో వాహనంలోకి తీసుకెళ్లారు. 20 నిమిషాల తర్వాత వాహనంపైకి చేరుకున్నారు. సింధూరరెడ్డి మాట్లాడుతూ 2014లో మామ పల్లె రఘునాథరెడ్డి విజయం కోసం ఇల్లిల్లూ తిరిగానన్నారు. నియోజకవర్గంలోని ప్రజల కష్ట నష్టాలు, గ్రామాల్లో ప్రజా సమస్యలు దగ్గరగా చూశానన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, తప్పకుండా తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రి పల్లె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ విధానాలు, నిరంకుశ పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో తెదేపా అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు
source : eenadu.net
Discussion about this post