ఉత్తరాంధ్ర వేదికగా ఎన్నికల ప్రచారానికి వైకాపా శ్రీకారం చుట్టింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని సంగివలస వద్ద ‘సిద్ధం’ పేరిట శనివారం బహిరంగ సభ నిర్వహించింది. ‘సిద్ధం’ అనగానే జగన్ ఏదో కొత్త విషయంతో వస్తారని అంతా ఎదురు చూశారు. అయితే ఎన్నికల ప్రచార సభకు సిద్ధమై వచ్చినట్లే కనిపించలేదు. ప్రసంగం ప్రారంభం నుంచి చివరి దాకా ఐప్యాక్ రాసిన స్క్రిప్టును చూసి చదవడమే సరిపోయింది. జగన్ తన ప్రసంగంతో కార్యకర్తల్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఎప్పుడూ 20 నిమిషాలు, అరగంటలో ప్రసంగం ముగించే జగన్ 1.15 గంటల పాటు కొనసాగించారు. నవరత్నాల్లోని సంక్షేమ పథకాలైన పింఛన్లు, ఆసరా, విద్యార్థులకు ట్యాబ్‌లు, చేయూత అంటూ మూడుసార్లు ప్రస్తావించారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామాన్ని తీసుకున్నా.. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధీ చేయలేదని, 56 నెలల్లో ఎక్కడ చూసినా జగన్ మార్కు పాలన కనిపిస్తుందని ఢంకా కొట్టిన జగన్… ఉత్తరాంధ్ర వేదికగా పూరించిన ఎన్నికల శంఖారావంలో అసలు తాను ఉత్తరాంధ్రకు ఏం చేశారు? ఏం ప్రాజెక్టులు తెచ్చారు? ఏం అభివృద్ధి చేశారో చెప్పకపోవడం గమనార్హం. విశాఖకు మకాం మారుస్తాం అంటూ ఊదరగొట్టే జగన్ పరిపాలనా రాజధాని అంశాన్ని ప్రస్తావించనేలేదు.
‘నన్ను చూసే ఓట్లేశారు’ అంటూ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోనార్కులా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలను కనీసం నాయకులుగా పరిగణించలేదు. ఎన్నికల వేళ మాత్రం సిద్ధం సభలో వైకాపా జగన్‌ది కాదని, మీ అందరి పార్టీ అంటూ స్వరం మార్చారు. పార్టీలో కష్టపడిన వారికి అంచెలంచెలుగా పెద్దపీట వేశానన్నారు. నిజంగా కష్టపడిన నాయకులకు పార్టీలో గుర్తింపు లేదని… ఇటీవల విశాఖ నుంచి వంశీకృష్ణ యాదవ్, సీతంరాజు సుధాకర్, పంచకర్ల రమేష్‌బాబు బయటకొచ్చిన విషయం విదితమే.
source : eenadu.net
Discussion about this post