మీ బిడ్డనంటూ ఓట్ల కోసం వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి మాటలు నమ్మితే.. మీ ఆస్తులు కూడా లాగేసుకుంటారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తేనె పూసిన కత్తిలాంటి జగన్ మాటలు నమ్మొద్దన్నారు. ఇప్పటికే ఒకసారి నమ్మితే అయిదేళ్లలో పీకల వరకు ముంచారని, ఈసారి నిండా ముంచేస్తారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కురుపాం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలలో మంగళవారం జరిగిన శంఖారావం సభల్లో ఆయన ప్రసంగించారు. మన వంశ పారంపర్యంగా దక్కిన భూ పట్టాలపైనా, సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. గతంలో పేదల కోసం తెదేపా ప్రవేశపెట్టిన పథకాలను కట్ చేయడమే ఈయన పనన్నారు. ఉత్తరాంధ్రకు పట్టిన శని ముఖ్యమంత్రి జగన్ అని వ్యాఖ్యానించారు. విశాఖను రాజధానిగా చేస్తానన్నా ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా వేయలేకపోయారని ఎద్దేవా చేశారు. సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడివక్కడే నిలిచి పోయాయన్నారు. నాగావళి, వంశధార ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. పాదయాత్ర సమయంలో జగన్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఇచ్చిన 60 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు.
source : eenadu.net
Discussion about this post