రా ష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. 66 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో వికృతక్రీడకు సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో అమలుచేసిన ఆదేశాల్నే.. మే నెలలోనూ కొనసాగించే ఆలోచన చేస్తోంది. సీఎం ముఖ్యకార్యదర్శి ధనుంజయరెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి తదితరులంతా వైకాపా కుటిల రాజకీయానికి వంతపాడుతున్నారు. వృద్ధులు నానాకష్టాలు పడుతున్నా.. ఏప్రిల్‌లో 30 మందికి పైగా మరణించినా వీరి మనసు కరగడం లేదు. వారంలో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వట్లేదు. ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరకయాతన పెట్టారు. ఇప్పుడూ అలాగే వృద్ధుల జీవితాలతో ఆటలాడుతూ.. మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘమూ జోక్యం చేసుకోవట్లేదు.
source : eenadu.net
Discussion about this post