వాళ్లంతా అఖిలభారత సర్వీసు అధికారులమనే ఇంగితం మరిచారు. అధికార వైకాపాకు బంటుల్లా మారారు. వైకాపా నాయకులు చెప్పిందే చట్టం. వారి మాటే శాసనం అన్నట్టుగా పనిచేశారు. అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ పేట్రేగిన ఈ అధికార గణం.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ స్వామిభక్తిని వీడలేదు. అధికార పార్టీ సేవలను ఆపలేదు. ప్రతిపక్షాలను అణచివేశారు. తప్పు మీద తప్పు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ పెద్దల అండ పుష్కలంగా ఉంటే తమను ఎవరేం చేస్తారనే ధీమాతో చెలరేగారు. చివరికి వారి తప్పులు నిగ్గు తేలాయి. కొంత ఆలస్యంగానైనా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు వారిపై వేటు వేసింది. గుంటూరు ఐజీ జి.పాలరాజు, కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్లు పి.రాజబాబు, ఎం.గౌతమి, డా.లక్ష్మీశ, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, వై.రవిశంకరరెడ్డి, పల్లె జాషువా, కేకేఎన్ అన్బురాజన్, కె.తిరుమలేశ్వరరెడ్డిలను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. నిబంధనలకు పాతరేసిన జగన్ భక్త అధికారులకు ఇది చెంపపెట్టు..
అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తిన ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. నిబంధనలకు పాతరేసిన ఈ సీనియర్ బ్యూరోక్రాట్లు.. వైకాపా కోసం ఆ పార్టీ కార్యకర్తలను మించి పనిచేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. ఈసీకి పలు మార్లు ఫిర్యాదులు చేసి.. వారిని విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కమిషన్.. తన అధికారాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకుంది.
source : eenadu.net
Discussion about this post