పేదల సొంతింటి కలను నెరవేరుస్తూ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుడుతోంది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తోంది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) అందించనుంది.
రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు నింపుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఎన్ అగ్రహారంలో కన్వేయన్స్ డీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన కన్వేయన్స్ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, యరజర్ల, వెంగముక్కల పాలెం గ్రామాల్లో 536.11 ఎకరాల భూసేకరణ ద్వారా రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం కన్వేయన్స్ డీడ్లను లబ్దిదారులకు అందించనున్నారు.
సచివాలయాల్లో సర్టిఫైడ్ కాపీ
ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధారణమే అయినా ఒకేసారి 30 లక్షల మందికి అందించడం, వాటిని సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్ చేస్తుండడం దేశంలోనే ప్రథమం. గతంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా వాటిపై పేదలకు హక్కులు ఉండేవి కాదు. “డి’ పట్టాలు కావడంతో అనుభవించడం మినహా హక్కులు లేనందున అవసరానికి వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. ఈ సమస్యను పరిష్కరిస్తూ ఇళ్ల పట్టాలు పొందిన పదేళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వ హక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది.
ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలకు సంబంధించిన యజమానులకు కన్వేయన్స్ డీడ్‌లు అందిస్తోంది. వారి పేరు మీద ఆ పట్టాలను రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ డీడ్‌లు పదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా సేల్ డీడ్‌లుగా మారతాయి. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నేరుగా ఆ స్థలాలను అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో ఇచ్చిన ‘డి’ పట్టాలను క్రమబద్దికరించుకోవడం ఎంత కష్టమో తెలిసిన విషయమే. రెవెన్యూ శాఖ ఎన్‌ఓసీ ఇవ్వడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ శాఖ దాన్ని మార్చడం ఓ ప్రహసనమే.
అలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేసి కన్వేయన్స్ డీడ్‌లు ఇస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టారు. ఈ రిజిస్ట్రేషన్ల డేటా మొత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లోని డేటాబేస్‌లో పదిలంగా ఉంది. లబ్దిదారులు ఎప్పుడైనా అక్కడి నుంచి తమ ఇళ్ల పట్టాకు సంబంధించిన సర్టిఫైడ్ కాపీని పొందే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోర్జరీ గానీ, ట్యాంపర్ చేయడానికిగానీ ఆస్కారం ఉండదు.
source : sakshi.com
Discussion about this post