ఉద్యోగాలివ్వడంలో.. రైతులు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడంలో, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ఇస్తున్నది బోగస్ రిపోర్టు అయితే, వైఎస్ జగన్ ఇస్తున్నది కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్ రిపోర్టు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వ హయాంలో 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహించామని చెప్పారు. మొట్ట మొదటిసారిగా ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిచ్చింది మీ బిడ్డ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
వాహన మిత్ర, నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ.. ఇలా అన్ని విధాలా ప్రోత్సహించబట్టే స్వయం ఉపాధి రంగం ఈరోజు తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతోందన్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక చక్రం పరుగులు పెడుతోందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా బుధవారం ఆయన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన సభలో మాట్లాడారు.
ఈ జన సంద్రాన్ని చూస్తుంటే నెల రోజుల్లోనే పట్టపగలు కోటప్పకొండ తిరునాళ్లు కనిపిస్తోందని అన్నారు. ఐదేళ్ల మన ప్రభుత్వంలో ఇంటింటికీ వచ్చిన అభివృద్ధిని, సంక్షేమాన్ని, లంచాలు, వివక్ష లేని పాలనను.. ఆ దుష్ట కూటమి, ఎల్లో మీడియా కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు పలనాటి సీమ పౌరుషంతో జన సముద్రంగా మారిన దృశ్యం కనిపిస్తోందని చెప్పారు.
source : sakshi.com
Discussion about this post