పిల్లర్ల దశలోనే ఆగిపోయిన ఈ నిర్మాణం కర్నూలులోని బీసీ భవన్. తెదేపా హయాంలో నగర పరిధిలో ఎకరం స్థలం కేటాయించి రూ.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు. రూ.40 లక్షల విలువైన పనులు పూర్తయ్యేనాటికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీసీలకు మేలు జరుగుతుంటే జగన్‌కు గిట్టదు కదా.. అందులోనూ తెదేపా హయాంలో ప్రారంభించింది కావడంతో పనుల్ని అక్కడితోనే ఆపేశారు. గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్నీ వెనక్కి తీసుకున్నారు. మరో చోటైనా కట్టారా అంటే.. అదీ లేదు. ఇదే ప్రాంగణంలో చేపట్టిన కాపు భవన్ నిర్మాణాన్ని కూడా అర్ధాంతరంగా నిలిపేశారు. ఆయనకేమో ఇంద్రభవనాలు కావాలి..బీసీలకు సామాజిక భవనాలు వద్దట..
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ముఖ్యమంత్రి జగన్‌ది ఒకే పాలసీ.. అదే జలసీ!! గత తెదేపా ప్రభుత్వ హయాంలో పునాది పడిందంటే చాలు.. అది అక్కడితో ఆగిపోవడమో లేదా కూలిపోవడమో జరగాల్సిందే. వెనకబడిన తరగతులకు చెందిన సామాజిక భవనాల నిర్మాణంలోనూ ఆయనది అదే తీరు. బీసీ భవన్‌లపైనా ఇదే కక్షసాధింపును ప్రదర్శిస్తూ, అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘నా బీసీ.. నా బీసీ’ అంటూ కురిపించిన ప్రేమనంతటినీ.. అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో కలిపేశారు. రాష్ట్రంలో ‘బీసీ భవన్’లకు ఈ అయిదేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా జగన్ కేటాయించలేదంటేనే ఆయనకు ఆ వర్గ ప్రజలపై ఉన్న బాధ్యత ఏపాటితో అర్థమవుతోంది. పైగా గత ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని.. ఇతర పనులకు మళ్లించేశారు.
బిల్లులు చెల్లించకుండా పెండింగ్….
జగన్ అధికారంలోకి రాగానే 25 శాతం కంటే తక్కువ పనులైన నిర్మాణాలను రద్దు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో అప్పటికే ఒక్కో భవనంపై రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు చేసిన ఖర్చు వృథా అయినట్లే లెక్క. ఆ తర్వాత మళ్లీ వాటిని పట్టించుకున్నది లేదు. పనులు నిలిపేయడంతోపాటు అప్పటి వరకు ఖర్చు చేసిన గుత్తేదారులకు చాలా చోట్ల బిల్లులు కూడా చెల్లించకుండా వైకాపా సర్కారు పెండింగ్ పెట్టింది. కర్నూలుకు చెందిన గుత్తేదారు కోర్టుకు వెళ్లి బిల్లులు విడుదల చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో బీసీ భవన్ నిర్మాణంలోనూ అంతే. రూ.5.45 కోట్లతో 2021లో పనులు ప్రారంభించి.. కొంతమేర పనులు జరిగాక.. చేతులెత్తేసింది. బిల్లులు చెల్లించలేదని గుత్తేదారు పనులు నిలిపేశారు.
source : eenadu.net
Discussion about this post