ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ.. ఆల్‌ఫూల్స్ డే..! బహుశా ఈ రోజు సీఎం జగన్ కంటే ఆనందంగా ఎవరూ ఉండరేమో..! ఎందుకంటే జనం చెవుల్లో అనునిత్యం పువ్వులు పెడుతూ వారిని పదేపదే ఫూల్స్‌ని చేయడంలో ఆయనకు మించినవాళ్లెవరు..! విపక్ష నేతగా పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలు, అధికారంలోకి వచ్చిన ఈ అయిదేళ్లలో ఇచ్చిన హామీల్లో 99% పూర్తిచేసేశామని సీఎం చెప్పడం అతి పెద్ద జోక్. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ప్రజలపై జోక్స్ వేస్తూనే ఉన్నారు.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే, చేసేసినట్లు చెబుతూ ప్రజల్ని ఫూల్స్‌ను చేస్తూనే ఉన్నారు..!
మద్యనిషేధం… అతి పెద్ద జోక్
ప్రజలపై జగన్ సంధించిన అతి పెద్ద జోక్ మద్యనిషేధం. ‘మేము అధికారంలోకి వచ్చాక మూడుదశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. 2024 ఎన్నికల్లో నేను ఓట్లడిగే సమయానికి మద్యాన్ని అయిదు నక్షత్రాల హోటళ్లకే పరిమితం చేస్తాం. ఆ తర్వాతే ఓట్లడుగుతా. దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నా’ ఇవి 2019 ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ చెప్పిన మాటలు. కానీ మద్యనిషేధం హామీకి మంగళం పాడేశారు. జగన్ అధికారం చేపట్టాక రూ.1.20 లక్షల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. జె-బ్రాండ్‌లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు రైతుల్ని ఆకట్టుకునేందుకు జగన్ ఊరికో హామీ ఇచ్చారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినదాని కంటే మిన్నగా ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామని ఇప్పుడు గొప్పలు చెబుతున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం ఇస్తోంది ఏటా రూ.7,500 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌నిధి కింద ఇస్తున్న రూ.6వేలు కూడా కలిపి..రూ.13,500 ఇస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు. ఇది రైతుల్ని ఫూల్స్ చేయడం కాదా? టమాటా ఎక్కువగా పండే రాయలసీమలో ప్రతి మండలంలోను జ్యూస్ పరిశ్రమలు, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా చాలా హామీలిచ్చి జనాన్ని మభ్యపెట్టారు.
ప్రత్యేక హోదాపై..
‘హోదా సాధిద్దాం..ఉద్యోగాల విప్లవం తెద్దాం’.. ఇది వైకాపా మ్యానిఫెస్టోలోని నినాదం. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్.. అధికారంలోకి వచ్చిన వెంటనే దిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల్ని ఫూల్స్‌ని చేశారు.
నిరుద్యోగుల్ని ముంచారు
లక్షల మంది నిరుద్యోగులు జగన్ చేతిలో ఫూల్స్‌గా మిగిలిపోయారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడంతో పాటు, ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వైకాపా మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ అయిదేళ్లలో ఒక్కసారే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అది కూడా అరకొర ఉద్యోగాలకే. అటు ప్రభుత్వ ఉద్యోగాలూ లేక, జగన్ అరాచక విధానాలకు భయపడి రాష్ట్రానికి పరిశ్రమలు ముఖం చాటేయడం, ఉన్న పరిశ్రమల్ని ప్రభుత్వం తరిమేయడం, ఐటీ రంగం అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధా పెట్టకపోవడంతో ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల్లేక యువత రాష్ట్రం నుంచి విపరీతంగా వలస పోతోంది. రాష్ట్రంలోని యువతలో వలసల రేటు 31.6 శాతం ఉన్నట్లుగా తాజా నివేదిక పేర్కొంది. దీనికేమంటారు జగన్? ఇచ్చిన హామీలను 99 శాతం పూర్తిచేస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది?
‘సీపీఎస్ రద్దు చేస్తాం. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. సకాలంలో పీఆర్‌సీ అమలు పరుస్తాం’ ఇది వైకాపా ఇచ్చిన హామీ. ఈ హామీలను గాలికొదిలేసి ఈ అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఉద్యోగుల్ని ఎంతగా ముప్పుతిప్పలు పెట్టిందో అందరికీ తెలుసు. సీపీఎస్ రద్దు చేయలేదు సరికదా.. దాని కోసం ఉద్యమించిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఉద్యోగుల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఏకపక్షంగా జీపీఎస్ పేరుతో కొత్త విధానం తెచ్చి వారిని ఫూల్స్‌ని చేశారు. పీఆర్‌సీలో ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గించేసి మరోసారి ఫూల్స్‌ని చేశారు.
‘రాజధాని’పై ఎన్ని నాటకాలో..!
రాజధానిపై జగన్ ఎన్నిసార్లు జనాన్ని ఫూల్స్‌ని చేశారో లెక్కేలేదు. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు తమకు అభ్యంతరం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి అమరావతిని దెబ్బతీశారు. పైగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేసినట్లు చెప్పారు. ప్రజలను ఎన్నిసార్లైనా ఫూల్స్‌ని చేయవచ్చని బలమైన నమ్మకమేదో జగన్‌కు ఉన్నట్లుంది.
పోలవరం ప్రాజెక్టుపై..
‘పోలవరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టుల్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం’- ఇదీ వైకాపా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. 2019 జూన్ 20న సీఎం హోదాలో తొలిసారి పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన జగన్… 2021 జూన్ నాటికి పోలవరం పూర్తి చేసి నీళ్లందిస్తామని చెప్పారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల్నీ అటకెక్కించేశారు.
ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ఎన్నికల ముందు గగ్గోలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు లీటరుకు రూ.2 ఉన్న అదనపు వ్యాట్‌ని రూ.4కు పెంచారు. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే లీటరు ధర రూ.10 ఎక్కువగా ఉంది.
Discussion about this post