సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్ అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం అన్ని పార్టీలకు ఆయన లేఖలు పంపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించే స్టార్ క్యాంపెయినర్లు, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు వీడియో కవరేజ్ వాహనాల అనుమతులను ప్రధాన ఎన్నికల అధికారి వద్ద తీసుకోవాలి. రాజకీయ పార్టీల ప్రచార సామగ్రి అనుమతులు కూడా సీఈవో వద్దనే పొందాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఊరేగింపులు, యాత్రలు, ర్యాలీలు నిర్వహించినట్లయితే ఆయా జిల్లాల ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరి. ప్రతి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రచార అనుమతుల దరఖాస్తులు, పర్యవేక్షణకు అనుమతులు లభిస్తాయి.
సభలు, సమావేశాలకు 48 గంటల ముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఎటువంటి ప్రచారాలకు అనుమతులు ఉండవు. ఎన్నికల రోజు నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించడానికి ఒక్కో అభ్యర్థికి ఒక వాహనంతో పాటు ఆయన తరఫున ఎన్నికల ఏజెంట్‌కు మరో వాహనానికి అనుమతి ఇస్తాం. లోక్‌సభ అభ్యర్థులకైతే వీరితో పాటు ఆయన పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ కార్యకర్తలు లేదా ఏజెంట్ వాహనానికి అనుమతి ఉంటుంది. ఇందులో డ్రైవర్‌తో పాటు అయిదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ మంది వెళ్లడానికి వీల్లేదు’ అని తెలిపారు.
source : eenadu.net
Discussion about this post