రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాగునీటి పథకం పనులకు బిల్లులు సకాలంలో అందించకపోవడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఏటా వేసవిలో నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతుండటంతో గత తెదేపా ప్రభుత్వం తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. 2019లో వైకాపా అధికారంలోకి రావడంతో ఎనిమిది నెలలపాటు పనులు నిలిపేసిన గుత్తేదారులు తిరిగి ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు గుత్తేదారులకు బిల్లుల మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో.. నత్తతో పోటీ పడి పనులు సాగుతున్నాయి. ప్రజలకు శాశ్వత దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో పది నెలలుగా ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ప్రతి ఇంటికి 24 గంటలు సురక్షిత తాగునీరందించాలనే లక్ష్యంతో 2019లో తెదేపా ప్రభుత్వం తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టింది. సుమారు ఐదేళ్లు గడుస్తున్నా 15 శాతం పనులు మాత్రమే జరిగాయి. 2022 జూన్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, ప్రభుత్వం గుత్తేదారులకు రెండోసారి 2023 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. అప్పటికీ పనులు పూర్తి కాకపోవడంతో మూడోసారి 2024 మార్చి వరకు గడువు ఇచ్చింది. అప్పటిలోగా పనులు పూర్తి చేయకపోతేే.. నిధులు వెనక్కిపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇంకో రెండేళ్లు అయినా పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అర్ధాంతరంగా ఆగిన తాగునీటి ట్యాంకులు, శుద్ధిప్లాంట్లు, పైపులైన్ పనులు దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి.
source : eenadu.net
Discussion about this post