ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ నేతృత్వంలో తెదేపా ఎన్నికల కో-ఆర్డినేటర్ కనకమేడల రవీంద్రకుమార్, జనసేన ప్రధాన కార్యదర్శి నాదెండ్ల మనోహర్, భాజపా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, భాజపా జాతీయ మీడియా సహ ఇన్‌ఛార్జి సంజయ్ మయూఖ్ నిర్వచన సదన్‌లోని సీఈసీ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, సుఖ్‌బీర్‌సింగ్ సంధులను కలిసి వినతి పత్రం సమర్పించారు. అందులో ఒక్కో అధికారి గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. మార్చి 16న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, ఈనెల 4న భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డిలు రాసిన లేఖలకు కొనసాగింపుగా తాము ఈ వినతిపత్రం సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, ఐజీపీ కొల్లి రఘురామ్‌రెడ్డితోపాటు మరో అయిదుగురు అధికారుల దుష్ప్రవర్తనపై ఎన్నికల సంఘం తక్షణం దృష్టిసారించాలి. వీరంతా జూనియర్ అధికారులైనప్పటికీ సీనియర్లను పక్కకు తప్పించి కీలక స్థానాలను ఆక్రమించారు. ఈ ఒక్క అంశం వారి నిష్పాక్షికతలోని డొల్లతనాన్ని, అనుచిత వైఖరిని చాటుతోంది. తమను అడ్డదారిలో అందలం ఎక్కించిన మాస్టర్లకు ప్రస్తుతం ప్రతిఫలం చెల్లించే పనిలో తలమునకలై ఉన్నారు. చీఫ్ సెక్రెటరీ, డీజీపీ, సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కుమ్మక్కై అక్రమాలు, ఆశ్రిత పక్షపతానికి ఎలా పాల్పడుతున్నదీ ఇదివరకే సమర్పించిన వినతిపత్రాల్లో వివరించాం. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ప్రోత్సహించడానికి ఈ అధికారులంతా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డితో పూర్తిగా కుమ్మక్కయ్యారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి వీరు కుట్రలు పన్నుతున్నారు’’ అని మూడు పార్టీల కూటమి ఎన్నికల సంఘానికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొంది. (ఎన్డీయే నేతలు మొత్తం 8 మంది అధికారుల గురించి ఈసీకి ఫిర్యాదు చేయగా, వారిలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఈసీ మంగళవారం సాయంత్రమే బదిలీ వేటు వేసింది.)
source : eenadu.net
Discussion about this post