ఎన్నికల వేళ మారీచుడి అవతారం ఓట్ల దొంగలను పంపిస్తున్నాడు
అభ్యర్థులను మార్చి ప్రజలను ఏమార్చి గెలవాలన్నదే లక్ష్యం
ఏమరుపాటుగా ఉంటే మిమ్మల్ని బానిసల్ని చేస్తాడు
72 రోజుల తర్వాత అమరావతికి పూర్వవైభవం
కలియుగ భస్మాసురుడిని అంతం చేయాలి
సైకోతోపాటు పిల్ల సైకోలందరికీ షాక్ ట్రీట్‌మెంట్ తప్పదు
పొన్నూరు, రాజమహేంద్రవరం ‘రా… కదలి రా’ సభల్లో చంద్రబాబు
నమ్మక ద్రోహం చేయడంలో ఈ దేశంలోనే నంబర్ వన్ సీఎం వైఎస్ జగన్ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తన అవసరం ఉన్నంత వరకూ వాడుకోవడం, ఆ తర్వాత చెత్తలో విసిరిపారేయడం ఆయన నైజమని చెప్పారు. ఈ విషయంలో ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వవచ్చన్నారు. ఇందుకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు పశ్చిమ శాసనసభ్యుడు మద్దాళి గిరిధర్‌లకు పట్టించిన గతే నిదర్శనమన్నారు. ‘‘తన సొంత మనిషి అని చెప్పి రామకృష్ణారెడ్డిని నమ్మించి టీడీపీపై జగన్ అనేక కేసులు వేయించాడు. అవసరం తీరాక ఒక్క తన్ను తన్ని బయటకు పంపేశాడు’’ అని విమర్శించారు. వైసీపీ గేమ్ ఓవర్..టీడీపీదే గెలుపు అని వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని వడ్లమూడి క్వారీ వద్ద; తూర్పుగోదావరి జిల్లా రూరల్ రాజమహేంద్రవరంలోని కాతేరులో టీడీపీ నిర్వహించిన ‘రా… కదలి రా..’భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ, జనసేన కూటమి ఐక్యత వర్థిల్లాలని పిలుపునిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘ఎన్నికలు సమీపించడంతో అభ్యర్థులను మార్చి ప్రజలను గందరగోళంలో పడేసి గెలుద్దామని జగన్ చూస్తున్నారు. కానీ, ఆయన పప్పులు ఉడకవు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. జగన్‌పై ప్రజల్లోనే కాదు…ఆయన సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. సత్యవేడు ఎమ్మెల్యేకు తిరుపతి ఎంపీ సీటు ఇస్తే తాను పోటీ చేయనన్నాడు. తన మీద మంత్రి పెద్దిరెడ్డి పెత్తనం ఏమిటి? గనులు దోచుకొని ఆ నిందలు తనపై మోపారని, రోజారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పెదిరెడ్డిలను మార్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించాడు. స్కూటర్‌పై తిరిగిన పెద్దిరెడ్డి రూ.వేల కోట్లకు ఎలా పడగలెత్తాడని నిలదీశాడు. 68 మందిని ఇప్పటివరకు మారిస్తే వారిలో 49 మంది బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీలే ఉన్నారు. నలుగురు ఎంపీలు జగన్‌తో వేగలేమని రాజీనామాలు చేసి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇద్దరు మంత్రులకు వేరే సీట్లు ఇస్తే వద్దని చెప్పారు. మొత్తం 20మంది మంత్రుల్లో 10మంది ఓడిపోతారనే నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఇక జగన్… నువ్వు ఎలా గెలుస్తావు?. ఈ కలియుగ భస్మాసురుడిని అంతం చేయడానికి ఓటు అనే వజ్రాయుధం మీ చేతిలో ఉంది’’
‘‘జగన్ కొత్తగా విశ్వసనీయత అంటూ నాటకానికి తెరలేపారు. జగన్ విశ్వసనీయత ఎలాంటిదంటే రూ. 200 ఉండే కరెంటు బిల్లుని రూ. 1000కి పెంచారు. మద్యం సీసాని రూ.60 నుంచి రూ. 200 చేశారు. పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలో ఇక్కడే ఎక్కువ. 24 శాతం నిరుద్యోగం తాండవిస్తున్నది. ఉచిత ఇసుకను కేజీల లెక్కన బొక్కేస్తున్నారు. ఎస్‌సీలను చంపి డోర్ డెలివరీ చేయించారు. పెట్రోలు పోసి బీసీ బిడ్డని చంపిన వాళ్లు బయట తిరుగుతున్నారు. పరదాల చాటున పర్యటనలు చేస్తూ, వాటి కోసం చెట్లు నరికిస్తున్నారు. రాజధాని లేకుండా చేశారు. గంజాయికి చిరునామాగా ఏపీని మార్చారు..’’
‘‘నాది విజన్. జగన్‌ది పాయిజన్. 20 ఏళ్ల తర్వాత ఏమి జరుగుతుందో ముందే ఊహించి అందుకు కార్యాచరణ రచించి ఇప్పటినుంచే నేను అమలు చేస్తా. జగన్ మాత్రం విధ్వంసానికి మారు పేరు. నా విజన్‌కు నమూనా సైబరాబాద్. అమరావతి వచ్చి ఉంటే ఈ పాటికే అభివృద్ధి జరిగేది. చిన్న లిటిగేషన్ కూడా లేకపోయినా జగన్..కులం అంటగట్టారు. మూడు ముక్కలు అంటూ సర్వనాశనం చేశారు. నేను, జగన్ శాశ్వతం కాదు. సమాజమే శాశ్వతం. సమాజానికి ద్రోహం చేసిన జగన్‌ని వదిలిపెడతారా? అమరావతి రాజధాని 72 రోజుల తర్వాత పూర్వవైభవం సంతరించుకోవడం ఖాయం. ఇది దేవతల రాజధాని. జగన్ లాంటి ఎంతమంది సైకోలు వచ్చినా ఏమీ చేయలేరు. అమరావతి రాజధాని 5 కోట్ల మంది ప్రజల నినాదం. ఇది తప్పకుండా సాధ్యమౌతుంది. అది జరగాలంటే మూడు రెక్కలున్న ఫ్యాన్‌ని విరిచి పారేయాలి. ఒక రెక్కని ఉత్తరాంధ్ర, రెండో రెక్కని ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నందుకు రాయలసీమ, మూడో రెక్కని కోస్తాంధ్ర ప్రజలు విరిచేస్తే రెక్కలు లేని ఫ్యాన్ తాడేపల్లి ప్యాలె్‌సలో కూర్చుండిపోతుంది. యువత ఎటువైపు ఉంటే ఆ పార్టీ గెలుపు ఖాయం. టీడీపీ- జనసేన కూటమి వైపే యువత ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక గెలుస్తున్నాం. అందువల్లే జగన్ దాడులు చేయిస్తున్నాడు. పార్టీ మారడానికి నిరాకరించాడని మాచర్లలో దుర్గారావు అనే మత్య్సకారుడిని పోలీసులు కొట్టాడు. తీవ్రంగా హెచ్చరించడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
‘నేను, పవన్ కల్యాణ్ స్వార్థం కోసం ప్రజల వద్దకు రావడం లేదు. రాష్ట్రం, తెలుగుజాతి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వస్తున్నాం. 72 రోజుల పాటు ప్రజలు రోడ్ల మీదే ఉండాలి. సైకిల్ ఎక్కాలి. గ్లాసు చేతబట్టాలి. రెండు చేతులతో రెండు జెండాలు పట్టుకొని ప్రచారం చేయాలి. ఈ పని మీరు చేయండి. మీ భవిష్యత్తుని బంగారం చేసి రుణం తీర్చుకొంటాను. ఉద్యోగులు కూడా జగన్‌ను నమ్మి మోసపోయారు. కనీసం సమయానికి జీతం ఇవ్వమని దైర్యంగా అడగలేకపోతున్నారు. వారికి జగన్ రూ.20 వేల కోట్ల బకాయిలు పెట్టారు. కాంట్రాక్టర్లకు రూ.90 వేల కోట్లు చెల్లించాలి. ఉపాధ్యాయులను బ్రాందీ షాపులకు కాపలా పెడుతున్నారు. పోలీసులు కూడా వైసీపీ నాయకుల ఇళ్లల్లో ఊడిగం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయే గడువు దగ్గర పడింది. దానిని నమ్ముకొంటే పోలీసులు ఇంటికి పోవాల్సి ఉంటుంది. రా… కదలి రా సభలు మరో 10 రోజుల్లో అయిపోతాయి, అప్పుడు జన ఉద్ధృతి చూస్తారు.. వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరి తీరు మరీ దారుణం.. పొన్నూరులో కిలారి రోశయ్య, పక్కా కిలాడీ..రాజమహేంద్రవరం ఎంపీ ఓ రీల్స్ మాస్టరు’’
పొన్నూరు నియోజకవర్గంలో ‘రా కదలిరా!’ సభ ప్రభంజనం సృష్టించింది. ఈ సభకు జనం భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ సభలకు ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోయినా, రవాణా సదుపాయాలు సరిపోకపోయినా జనం మాత్రం గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. చంద్రబాబు వస్తున్న హెలికాప్టర్‌ను చూస్తూ మహిళలు, యువకులు, కార్యకర్తలు పచ్చ కండువాలు, జెండాలు ఊపుతూ అధినేతకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ సభకు ఈసారి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు హాజరయ్యారు.
‘‘స్థానిక సంస్థల్లో 8 శాతం రిజర్వేషన్లను ఎన్‌టీఆర్ తీసుకొచ్చారు. అప్పటి నుంచే సాధికారత ప్రారంభమైంది. ఆస్తిలో సమాన హక్కు ఉండాలని అప్పట్లోనే చట్టం తెచ్చారు. ఇప్పుడు వైఎస్ సంపాదించిన ఆస్తిలో వాటాని తన అన్నయ్య జగన్ ఇవ్వలేదని ఆయన కుమార్తె షర్మిల అడుగుతున్నారు. దీనికి సైకో జగన్ ఏమి సమాధానం చెబుతారు? నేను ఉద్యోగాలు, కాలేజీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో చాలామంది చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొన్నారు. దాంతో వరకట్నం, అమ్మాయిలకు పెళ్లి కావడం లేదన్న సమస్యలు తీరిపోయాయి. నేడు పురుషులకే పెళ్లిళ్లు కాని పరిస్థితి ఉంది’’
హామీలు….
ప్రతీ ఆడబిడ్డకు (19 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యన వయస్సు) నెలకు రూ. 1500 సాయం.
తల్లికి వందనం కింద రూ. 15 వేలు.
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ
ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..
source : andhrajyothi.com
Discussion about this post