ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం
రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేక పోయారో అడుగుతాం
వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ
ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదులను కేంద్రానికి పంపించాం
40 మంది వాలంటీర్లను తొలగించాం
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా
‘గత మూడు రోజుల్లో గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు జరిగాయి. మాచర్లలో వాహనం తగలబెట్టారు. గురువారం సాయంత్రం 4 గంటలకు నా ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఈ మూడు హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను ఆదేశించాను. అసలు ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? విచారణలో ఏం తేలింది? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు అనే అంశాలపై వారి నుంచి నివేదిక తీసుకుంటాం. వారిచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి’ అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రత వైఫల్యం అంశం కేంద్ర హోం శాఖ, ఎస్‌పీజీ పరిశీలనలో ఉందన్నారు. దీనిపై రాజకీయ పార్టీలిచ్చిన ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించొచ్చా లేదా అనేదానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం. వారు అనుమతిస్తే పరీక్షలను యధాతథంగా కొనసాగించుకోవచ్చు. వద్దంటే వాయిదా వేయిస్తాం. అక్కడి నుంచి నిర్ణయం వెలువడే వరకూ ఇప్పటికే నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలనూ విడుదల చేయొద్దంటూ విద్యాశాఖను ఆదేశించాం. 6,100 డీఎస్సీ పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాల్సిన పరీక్షలను ఎన్నికల కోడ్ రీత్యా వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా వినతులు అందాయి. కొద్ది మంది మాత్రమే పరీక్షలను కొనసాగించాలని కోరారు. దీనిపై తుది నిర్ణయం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం’ అని ఆయన వివరించారు. సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామ, వార్డు వాలంటీర్లు ద్వారా అందించొచ్చా లేదా అనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు.
85 ఏళ్ల పైబడిన వృద్ధులకే ఇంటి నుంచి ఓటేసే అవకాశం ఉంది. ఇలాంటి ఓటర్లు 2.12 లక్షల మంది ఉన్నారు. వీరు ఇంటి నుంచే ఓటు వేయాలనుకుంటే స్వయంగా ఫారం-12డీలు సమర్పించాలి. వారి తరఫున వేరెవరు దరఖాస్తు చేసినా దాన్ని ఆమోదించం. ఫారం-12డీలను వారికి అందించినప్పుడు, అవి వారి వద్ద నుంచి తీసుకున్నప్పుడు కచ్చితంగా ఫొటోలు తీసుకుంటాం.
సి-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు
నామినేషన్లు వేసిన రోజు నుంచే అభ్యర్థి వ్యయం పరిగణనలోకి
‘అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని నామినేషన్లు వేసిన రోజు నుంచే పరిగణనలోకి తీసుకుంటాం. ఓట్ల లెక్కింపు తేదీ వరకూ వ్యయాన్ని లెక్కిస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, సలహాదారులు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంగా పరిగణనలోకి వస్తారు. కోడ్ అమల్లో ఉన్న సమయంలో వారు అధికారిక వాహనాలు వినియోగించటానికి వీల్లేదు. సలహాదారుల రాజకీయ ప్రచారంపై నిషేధం లేదు. కేవలం అధికార యంత్రాంగంపైనే నియంత్రణ ఉంటుంది. ఉస్తాద్ భగత్‌సింగ్ ట్రైలర్‌లో ‘గాజు గ్లాసు’ గుర్తు చూపి ప్రచారం చేస్తే అది రాజకీయ ప్రకటన కిందకు వస్తుంది. దానిపై నిషేధమేమీ లేదు. అయితే దానికి అనుమతి కోసం వారు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆ ట్రైలర్ పరిశీలించి నోటీసిస్తాం. ఏదైనా పథకాల లబ్ధి ఎన్నికల కోడ్ అమల్లోకి రావటం కంటే ముందే విడుదలైతే తప్పు లేదు. ఆ తర్వాత విడుదల చేయాలనుకుంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే’ అని మీనా అన్నారు.
source : eenadu.net
Discussion about this post