వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి చాన్నాళ్ల ముందే ఆయా పథకాలకు సంబంధించిన చెల్లింపుల కోసం బటన్‌లు నొక్కినా… ఆ వెంటనే ఆ సొమ్ములు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేకపోయారో చెప్పాలని, ఆ జాప్యానికి కారణాలేమిటో వివరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని ఈసీ ఆదేశించింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల్లోగా దీనిపై నివేదిక పంపించాలని కోరింది. పోలింగ్ తేదీ ముంచుకొస్తున్న ఈ దశలో ఆయా పథకాల సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడమంటే.. అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చడమేనని పేర్కొంది. తద్వారా లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతింటుందని తెలిపింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డికి లేఖ రాసింది. మే 13 తర్వాతే వీటి చెల్లింపులు చేపట్టాలని ఆ లేఖలో నిర్దేశించింది. ప్రభుత్వ ప్రయత్నాలను నిలువరిస్తూ గురువారం ఉదయం ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దీనిపై కొందరు లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్లగా, దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 11 నుంచి 13 వరకు జమ చేయవద్దని గురువారం రాత్రి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆసరా (జనవరి 23), కల్యాణమస్తు/షాదీ తోఫా (ఫిబ్రవరి 28), విద్యాదీవెన (మార్చి 1), రైతుల పెట్టుబడి రాయితీ (మార్చి 6), చేయూత (మార్చి 7), ఈబీసీ నేస్తం (మార్చి 14) పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు రూ.14,165.66 కోట్ల చెల్లింపుల కోసం ఈ ఏడాది జనవరి 23 నుంచి మార్చి 14 మధ్య జగన్ బటన్‌లు నొక్కారు. వాస్తవంగా బటన్ నొక్కిన 24 గంటల్లో సొమ్మంతా లబ్ధిదారుల ఖాతాల్లో జమకావాలి. గరిష్ఠంగా 48 గంటలకు మించకూడదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు రూ.13 వేల కోట్లకుపైగా బిల్లులు చెల్లించి దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం.. బటన్ నొక్కిన పథకాలకు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేయలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే చెల్లింపులకు అడ్డంకి ఏర్పడుతుందని తెలిసినా దురుద్దేశ పూర్వకంగా జాప్యం చేశారు.
ఆన్‌గోయింగ్ పథకాల పేరిట వీటికి సంబంధించిన సొమ్ము చెల్లింపునకు ఈసీ అనుమతి కోరి తద్వారా పోలింగ్‌కు ఒకటిరెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఎత్తుగడ వేశారు. తద్వారా ప్రభుత్వ సొమ్ముతో వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయొచ్చని కుట్రపన్నారు. ఈ కుతంత్రంపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. నిధుల్ని 13 తర్వాత జమ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే… విపక్షాలు అడ్డుకోవటం వల్లే సంక్షేమ పథకాల డబ్బులు చెల్లించలేక పోయామంటూ జగన్ దుష్ప్రచారం చేస్తున్నారు.
source :eenadu.net
Discussion about this post