ముఖ్యమంత్రి జగన్‌ని అడుగడుగునా పొగుడుతూ… తెదేపాపక్ష నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యంగ్య వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూ.. గత అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఉద్ధరించేసినట్లు చెప్పుకుంటూ..పదే పదే అడిగి మరీ సభ్యులతో చప్పట్లు కొట్టించుకుంటూ.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. దాదాపు రెండు గంటలపాటు బడ్జెట్‌ను చదివిన ఆయన అందులోని అంశాలకే పరిమితం కాకుండా.. సొంత డబ్బా, పరనిందతో ఏవేవో కథలు చెప్పుకుంటూ పోయారు. సంక్షేమ పథకాలు, మహిళా సాధికార కార్యక్రమాల ద్వారా ప్రజల జీవితాలు మారిపోతున్నాయంటూ కొందరి గురించి తెరపై ప్రదర్శించారు. ఒకానొక దశలో బుగ్గన బడ్జెట్ చదువుతున్నారా లేక ఏదైనా రాజకీయ పార్టీ సభలో మాట్లాడుతున్నారా అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది.
మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న సందర్భంలో సభలో సభ్యుల నుంచి స్పందన లేకపోవడంతో..మహిళా సభ్యులూ..మీరైనా అభినందించరా? అంటూ అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నారు. విద్యాశాఖ గురించి వివరిస్తున్న సందర్భంలో ఎవరూ ఏమీ పట్టనట్లు ఉండటంతో మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి.. ‘విద్యాశాఖామంత్రి గురించి.. మీ శాఖలో సాధించిన వాటి గురించే చెబుతున్నా’ అని వ్యాఖ్యానించారు. కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం మంజూరైందని బుగ్గన చెప్పినా.. ఏ ఒక్కరి నుంచి స్పందన లేకపోవడంతో కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలూ మీ గురించే చెబుతున్నా…అంటూ అడిగి మరీ వారితో చప్పట్లు కొట్టించుకున్నారు. పత్తికొండ, డోన్, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోశామని చెబుతున్న సందర్భంలోనూ..ఎమ్మెల్యేలు ఎవరూ సరిగ్గా పట్టించుకోకపోవడంతో ‘పత్తికొండ ఎమ్మెల్యే గారూ.. మీ నియోజకవర్గం గురించే చెబుతున్నా’ అని గుర్తు చేసి మరీ చప్పట్లు కొట్టించారు. ఇలా పదే పదే చేశారు.
గత ప్రభుత్వం 4.63 లక్షల ఇళ్ల పట్టాలిచ్చింది.. అబ్బెబ్బే లేదు
గత ప్రభుత్వం తన అయిదేళ్ల పదవీ కాలంలో 4,63,697 ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిందంటూ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా బుగ్గన చదివి వినిపించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయనకు చీటీలు అందడంతో మళ్లీ మాటమార్చి గత ప్రభుత్వ హయాంలో అసలు ఇళ్ల పట్టాలే పంపిణీ చేయలేదని చెప్పారు. మరో సందర్భంలో.. జగనన్న పాలవెల్లువ పథకం పాడి రైతులకు లీటరుకు రూ.5 నుంచి రూ.20 వరకూ అధికంగా పొందేందుకు సాయపడిందని చెప్పారు. మళ్లీ కొంతసేపటి తర్వాత ఆయనకు చీటీ అందడంతో జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా రైతులు లీటరుకు రూ.10 నుంచి రూ.20 వరకూ ఎక్కువగా పొందారంటూ మాట మార్చారు.
source : eenadu.net
Discussion about this post