ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’కు సరైన స్పందన లేకపోయినా ప్రచారం కోసం వైకాపా నేతలు అతిగా హడావుడి చేస్తున్నారు. యువ ఓటర్లకు గాలం వేసేందుకు ఐప్యాక్ సూచనతో తెరపైకి వచ్చిన ఈ కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయినా ముగింపు వేడుకను రాజకీయ ప్రచార వేదికగా మార్చుకోవడానికి సిద్ధమైపోయారు. విశాఖపట్నంలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఏసీఏ-వీడీసీఏ)లో మంగళవారం ఈ కార్యక్రమం జరగనుండగా.. స్టేడియంను రాజకీయాలకు వేదికగా మార్చడంపై క్రీడాభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు విజయసాయిరెడ్డి బంధుగణం శరత్‌చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డిలు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఉండగా ఆయన ప్రధాన అనుచరుడు గోపీనాథ్‌రెడ్డి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడుదాం ఆంధ్రా ముగింపు కార్యక్రమంలో లేజర్ షో, డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శన ఏర్పాటు చేశారు. డ్రోన్లు, లేజర్ షోలతో జగన్ రూపం, వైకాపా నవరత్నాలు, ఆడుదాం ఆంధ్రా లోగోలను ప్రదర్శించనున్నారని సమాచారం. స్టేడియంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంతవర్మ ఇతర అధికారులు సోమవారం పరిశీలించారు.
వాలంటీర్లకు వాట్సప్‌లో ఆదేశాలు
విశాఖ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ రాష్ట్రస్థాయి పోటీల్లో 3 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఓటమి పాలైన జట్లు సొంత జిల్లాలకు వెళ్లిపోతుండటంతో ముగింపు వేడుకలో క్రీడాకారులు ఎక్కువ మంది కనపడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో 24 వేల సామర్థ్యం ఉన్న స్టేడియంను నింపడానికి వైకాపా కార్యకర్తలతో పాటు, ప్రతి సచివాలయం పరిధిలో 45 ఏళ్ల లోపు ఉండి, నవరత్నాలు అందుకుంటున్న లబ్ధిదారులను బస్సుల్లో స్టేడియంకు చేర్చే బాధ్యతను మెప్మా మహిళా సభ్యులకు, వాలంటీర్లకు అప్పగించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతలిచ్చే ప్రయత్నం చేయగా ‘సిద్ధం’ సభకు, సాధికార బస్సు యాత్రలకు జనసేకరణ చేసి అలసిపోయామని, ఇక తమ వల్ల కాదంటూ పలువురు చేతులెత్తేసినట్లు సమాచారం.
source : eenadu.net
Discussion about this post