ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆడబిడ్డలు దేశంలోని పేరున్న విద్యాసంస్థల్లో చేరి ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేయాలన్నా, విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాలన్నా.. అందుకు అవసరమయ్యే బ్యాంకు రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతోపాటు వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ వరకు మాత్రమే ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇచ్చి ఆపేస్తోందని.. దీంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని ఆడబిడ్డలు కోల్పోతున్నారని వివరించారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపకరించే ఏ కోర్సులకైనా ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా ఆర్థిక అండదండలు అందిస్తామన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బుధవారం ఆయన ‘కలలకు రెక్కలు’ నమోదును అధికారికంగా ప్రారంభించారు. ‘ప్రపంచవ్యాప్తంగా యువతకు ఎన్నో అవకాశాలున్నాయి. ఎన్నో కలలు, వాటిని సాధించే శక్తి, రాణించే చురుకుదనం ఉంది. అయితే ఇంటర్ తర్వాత ఎంతో మంది ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. ఉపకారవేతనాలున్నా అవి కొంత మేరకే ఉపయోపడుతున్నాయి. విదేశీ విద్య పథకం ఉన్నా కొందరికే పరిమితమైంది. రూ.వేల కోట్లలో ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం రుణ హామీ అయినా ఇస్తే.. ఆడబిడ్డలు వంద రెట్లు ఎక్కువ సంపాదిస్తారు’ అని వివరించారు. అధికారంలోకి వచ్చాక కలలకు రెక్కల పథకం అమలు చేస్తూనే.. ఇతర పథకాల్ని కూడా కొనసాగిస్తామని తెలిపారు. ‘ఆడబిడ్డలు బ్యాంకు రుణం తీసుకుని స్వేచ్ఛగా ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని కల్పిస్తాం. ఎంత డబ్బుకు అయినా ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఉన్నత పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవచ్చు’ అని చెప్పారు. ఇప్పటి వరకు 12వేల మంది ఇందులో నమోదు చేసుకున్నారని, ఇంటర్ పూర్తయిన ప్రతి ఆడబిడ్డావెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని చంద్రబాబు కోరారు. అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నమోదు పూర్తయిన వెంటనే ధ్రువీకరణ పత్రం కూడా వస్తుందన్నారు. ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా ఇది ఆడబిడ్డల భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని పేర్కొన్నారు. ఉద్యోగం చేసే వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంపాదిస్తున్నారన్నారు. ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. అయితే వారికి మెరుగైన అవకాశాలను కల్పించాలి’ అని వివరించారు.
అన్ని రంగాలకూ ప్రోత్సాహం
ఐటీ ఒక్కటే కాకుండా.. ఏ రంగంలో విజ్ఞానం సంపాదించుకోవాలన్నా ‘కలలకు రెక్కలు’ ద్వారా ప్రోత్సాహం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఏ రంగంలో అయినా సంపాదించుకోవచ్చు. ఆకాశమే హద్దు. మీ కలల్ని నిజం చేసుకోవడానికి మేం తోడ్పడతాం. ప్రపంచం మారిపోతోంది. అన్ని రంగాల్లో పెనుమార్పులు వస్తున్నాయి. సేవా రంగంలో భారత్ దూసుకెళ్తోంది. దీన్ని అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. ‘వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. పొలంలో ఎక్కడైనా తెగులు ఉంటే డ్రోన్ వెళ్లి గుర్తిస్తుంది. ఎక్కడ ఏ మందు అవసరమో, అక్కడ మాత్రమే పిచికారీ చేయడం ద్వారా మొత్తం పొలానికి చల్లాల్సిన పని లేకుండా ఖర్చు తగ్గించుకోవచ్చు’ అని వివరించారు.
నేను నష్టపోయినా.. జాతి బాగుపడింది
‘విదేశాల్లో ఉండే వారిలో భారతీయుల తలసరి ఆదాయం అధికం. అందులోనూ తెలుగువారు మరింత ఎక్కువ. గతంలో ఐటీని ప్రోత్సహించాం. అందుకు అవసరమైన కంపెనీలను హైదరాబాద్‌కు తెచ్చాం. హైటెక్‌సిటీ నిర్మించాం. పనిచేసే వాళ్లకు ఉద్యోగాల కల్పన, చదువుకునే వారికి విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. ఐటీ ఉద్యోగులంతా ఇతర దేశాలకు వెళ్లడంతో.. తెదేపా ఓట్లన్నీ విదేశాలకు వెళ్లిపోయాయని అంటుంటారు. నేను నష్టపోయినా జాతి బాగుపడింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మహిళలకు శక్తి ఇస్తున్నాం
‘తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ‘మహాశక్తి’ కింద అయిదు కార్యక్రమాలు అమలు చేస్తాం. కుటుంబాల్ని పైకి తెచ్చేందుకు అవసరమైన శక్తిని మహిళలకు ఇస్తున్నాం’ అని చంద్రబాబు వివరించారు.
- తల్లికి వందనం- ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ.. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేల చొప్పున
- దీపం – ఏడాదికి కుటుంబానికి 3 సిలిండర్లు ఉచితం
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
- 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు అందరికీ.. ఒక్కొక్కరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ
- తాగునీటి ఇబ్బంది లేకుండా.. రక్షిత మంచినీటి సరఫరా
source : eenadu.net
Discussion about this post