వివేకా హత్య ఘటనకు సంబంధించి తన మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి.. ఎంపీ అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడటంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య అనంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంటే అవినాష్‌రెడ్డి అంత అమాయకంగా చూడటానికి ఆయన ఏమైనా పాలుతాగే బిడ్డా అంటూ ప్రశ్నించారు. ఎంపీగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు ఆదివారం వైయస్‌ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వివేకా కుమార్తె సునీతతో కలిసి పలు సభల్లో షర్మిల ప్రసంగించారు. తాను తెలంగాణ నుంచి ఇక్కడకు వచ్చానంటూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అక్కడ నియంత కేసీఆర్‌ను ఓడించానని.. ఏపీలోనూ జగన్‌ను ఇంటికి పంపడానికి వచ్చానని చురకలు అంటించారు. ఈ అంశంపై ఆయనకున్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. స్వప్రయోజనాల కోసం జగన్‌రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారని, మరోసారి అధికారం చేతికిస్తే జనాన్ని సైతం తాకట్టు పెట్టేస్తారని హెచ్చరించారు.
కడప ఉక్కు పరిశ్రమను శంకుస్థాపన ప్రాజెక్టుగా జగన్ మార్చేశారని ఎద్దేవా చేశారు. కడప ఉక్కు పరిశ్రమ పూర్తయి ఉంటే వేల మందికి ఉద్యోగాలొచ్చేవని పేర్కొన్నారు. రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్న జగన్‌రెడ్డి మాట నిలబెట్టుకున్నారా, వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారా.. అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తానన్న సీఎం.. దగా డీఎస్సీ వేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క వర్గాన్నయినా పట్టించుకున్నారా అంటూ విమర్శలు గుప్పించారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ 20 శాతం జనాభాను అనారోగ్యం పాల్జేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులు చట్టసభలకు వెళ్లరాదనే నిర్ణయంతోనే కడప నుంచి పోటీ చేస్తున్నానని వివరించారు. మాట ఇస్తే తప్పడం వైఎస్సార్ జీవితంలో లేదని, జగన్ మాత్రం మాట తప్పడాన్నే అలవాటుగా చేసుకున్నారని విమర్శించారు. ధర్మం, న్యాయం కోసమే ప్రజల ముందుకు తానొచ్చానని షర్మిల స్పష్టం చేశారు. కార్యక్రమానికి పీసీసీ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి సారథ్యం వహించారు.
source : eenadu.net
 
	    	 
                                









 
                                    
Discussion about this post