రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రోజురోజుకీ సమీపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీట్ల పంపకాలను నానుస్తుండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటివరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగానే వారు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. క్షేత్రస్థాయిలో జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కలిసి పనిచేసే పరిస్థితి లేకున్నా ఉద్దేశపూర్వకంగానే వారిద్దరూ నెలల తరబడి సీట్ల విషయంలో సాగదీత వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు.
అలాగే, పొత్తులో భాగంగా జనసేన 60కి పైగా సీట్లను కోరుకుంటుండగా టీడీపీ అతితక్కువగా అంటే 20కి అటూఇటుగా సరిపుచ్చాలనే ధోరణితో ఉంది. ఈ విషయం పవన్‌కు స్పష్టంగా తెలుసునని.. అయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే పవన్ చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారన్నది స్పష్టంగా అర్ధమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. అసలు జనసేనకు కేటాయించే సీట్లు అరవయ్యా.. ఇరవయ్యా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబుకు పోటీగా పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించడం కూడా పెద్ద నాటకమేనని.. అదేదో చంద్రబాబుకు కౌంటర్‌గా తాను ఆ ప్రకటన చేసినట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చుకున్నారని.. ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
source : sakshi.com
Discussion about this post